నేడు ఎంసెట్-2 నోటిఫికేషన్ | Today EAMCET -2 notification | Sakshi
Sakshi News home page

నేడు ఎంసెట్-2 నోటిఫికేషన్

Published Wed, May 25 2016 3:15 AM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM

నేడు ఎంసెట్-2 నోటిఫికేషన్

నేడు ఎంసెట్-2 నోటిఫికేషన్

జూలై 9న ప్రవేశ పరీక్ష
- ఆ తర్వాత వారంలో ఫలితాలు.. ఆగస్టు 1 నుంచి తరగతులు
నీట్‌పై ఆర్డినెన్స్‌తో ప్రవేశాలపై తొలగిన సందిగ్ధం
ప్రభుత్వ, ప్రైవేటులో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ఎంసెట్ ద్వారానే
ప్రైవేటు కాలేజీల్లో బీ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్లు నీట్ ద్వారా భర్తీ
ప్రైవేటు వైద్య సీట్లకు జూలై 24న నీట్-2
 
 సాక్షి, హైదరాబాద్: నీట్‌పై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ల్లో ప్రవేశాలకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం మెడికల్ ఎంసెట్-2కు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిసింది. ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి నోటిఫికేషన్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జూలై 9న మెడికల్ ఎంసెట్-2 నిర్వహిస్తారు. అదే రోజు కీ విడుదల చేస్తారు. వారానికి ఫలితాలు విడుదల చేస్తారు. నీట్-2 ప్రవేశ పరీక్ష జూలై 24న నిర్వహించనున్నారు. ఇక నీట్‌పై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం.. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని మొత్తం సీట్లతోపాటు ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్-2 ద్వారానే భర్తీ చేయనున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ(35 శాతం), 15 శాతం ఎన్నారై కోటా సీట్లను మాత్రం ‘నీట్’ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.

 1,025 ప్రైవేటు సీట్లకు నీట్
 తెలంగాణలో మొత్తం 18 మెడికల్ కాలేజీలున్నాయి. వాటిలో 2,750 ఎంబీబీఎస్ సీట్లున్నా యి. అందులో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో(కొత్తగా వచ్చే మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలుపుకొని) వెయ్యి సీట్లున్నా యి. 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,450 సీట్లున్నాయి. ఇవిగాక రెండు మైనారిటీ కాలేజీల్లో 300 సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లను, 10 నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లోని 1,450 ఎంబీబీఎస్ సీట్లల్లో 50 శాతం(725) సీట్లను ప్రభుత్వం నిర్వహించే మెడికల్ ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ లెక్కన 1,725 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తారు.

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 35శాతం(507) బీ కేటగిరీ సీట్లను, మరో 15శాతం(218) సీట్లను ఎన్నారై కోటా సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. అలాగే మైనారిటీ కాలేజీల్లోని 300 సీట్లనూ నీట్ ద్వారానే భర్తీ చేస్తారు. మొత్తం 1,025 సీట్లను నీట్ ద్వారా భర్తీ చేస్తారు. ఇక డెంటల్‌లో ప్రభుత్వ కాలేజీ ఒకటి ఉండగా అందులో 100 సీట్లున్నాయి. ప్రైవేటు డెంటల్ కాలేజీలు 11 ఉండగా... వాటిలో 1,040 సీట్లున్నాయి. వాటిలో ప్రభుత్వ, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ ఆధారంగా.. మేనేజ్‌మెంట్ సీట్లను నీట్ ద్వారా భర్తీ చేస్తారు.

 ప్రైవేటు మెడికల్ కాలేజీలపై పిడుగు
 కేంద్ర ఆర్డినెన్స్ ప్రైవేటు మెడికల్ కాలేజీలకు పిడుగులాంటిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే బీ కేట గిరీ, ఎన్నారై మెడికల్ సీట్ల భర్తీ జరిగితే కాలేజీల ఇష్టారాజ్యానికి చెక్ పడినట్లేనంటున్నారు. అయితే నీట్ ర్యాంకులను ప్రకటిం చాక.. అడ్మిషన్లు ఎవరు నిర్వహిస్తారన్న దానిపైనే ప్రైవేటు కాలేజీలకు ముకుతాడు పడుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుందంటున్నారు. ర్యాంకులు ప్రకటించాక రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే అడ్మిషన్లు నిర్వహిస్తే ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు.  
 
 ఆర్డినెన్స్ శాస్త్రీయంగా ఉంది
 కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ శాస్త్రీయంగా ఉంది. ప్రభుత్వ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లకు మాత్రమే ఎంసెట్ నిర్వహించాలనడం సమంజసం. ఎందుకంటే ఆ సీట్లకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మాత్రమే పరీక్ష రాస్తారు. బయటి రాష్ట్రాల వారు రాయరు. ప్రైవేటులోని బీ కేటగిరీ సీట్లకు గతంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక పరీక్ష నిర్వహించారు. ఎన్నారై సీట్లను వారిష్టం వచ్చినట్లు భర్తీ చేసుకునేవారు. కాబట్టి నీట్ పరిధిలోనే వాటిని భర్తీ చేయాలనడం సమంజసంగా ఉంది. నీట్ వల్ల దేశంలో వివిధ రాష్ట్రాల ప్రవేశ పరీక్షలు రాసే ఇబ్బంది తప్పుతుంది. రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రైవేటు సీట్లలోనూ ప్రవేశాలకు అవకాశం దక్కుతుంది.
 - కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, వరంగల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement