ఇక ‘108’ ద్విచక్ర వాహనాలు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రద్దీతో కొట్టుమిట్టాడే హైదరాబాద్ సహా పలు నగరాలు, పట్టణాల్లో ‘108’ అత్యవసర అంబులెన్సులు సకాలంలో బాధితుల వద్దకు చేరుకోవడం లేదు. దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా వెళ్లే అత్యవసర ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఫైలు ఆర్థిక శాఖ వద్దకు వెళ్లింది. అనంతరం సీఎం సంతకం చేశాక ఇవి రోడ్లపైకి వస్తాయి. ముందుగా హైదరాబాద్ నగరంలో 50 వాహనాలను ప్రవేశపెట్టి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. 50 వాహనాలకు జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి రూ.70 లక్షలు కేటాయించారు.
ప్రాథమిక చికిత్సే లక్ష్యం...
తమిళనాడులో ప్రస్తుతం ఇలాంటి ‘108’ ద్విచక్ర వాహనాలు వైద్య సేవలు అందిస్తున్నా యి. ఆ రాష్ట్రంలో ఇటీవల పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వీటిని పరిశీలించారు. అంతకుముందే ఈ ఆలోచనలో ఉన్న ప్రభుత్వం... తమిళనాడులో పరిశీలించాక ఆగమేఘాల మీద అందుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖకు పంపింది. ప్రమాదం లేదా ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స అందించేలా ద్విచక్ర వాహనంలో వైద్య పరికరాలు, మందులతో కిట్టు ఉంటుంది. ప్రాథమిక వైద్య చికిత్స తెలిసిన వ్యక్తే నడుపుతాడు. వాహనానికి నేవిగేటర్ సౌకర్యం కల్పిస్తారు. దాని ఆధారంగా బాధితుడు ఉన్న చోటుకు చేరేలా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తారు. ప్రస్తుత ‘108’ అంబులెన్స్ సగటున 20 నిముషాల్లో చేరితే అదే ప్రాంతానికి ద్విచక్ర వాహనం 10 నిముషాల్లోపే వెళ్లేలా ఏర్పాట్లు ఉంటాయి.