నేడు ఆఖరి ఘట్టం
తుదిపోరులో ఉత్తరాది రాష్ట్రాలు
సెమీస్‌లో ఓడిన ఆంధ్ర బాలుర జట్టు
సత్తాచాటుకున్న మధ్యప్రదేశ్ బాలికలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : మూడు రోజులుగా అనంత క్రీడాగ్రామంలో జరుగుతున్న జాతీయ 38వ సాఫ్ట్‌బాల్ టోర్నీ తుదిదశకు చేరుకుంది. శనివారం జరిగే ఫైనల్స్‌లో ఉత్తరాది జట్లు తలపడనున్నట్లు రాష్ట్ర సాఫ్ట్‌బాల్ కార్యదర్శి వెంకటేశులు, జిల్లా అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. టోర్నీ ఫెవరేట్‌గా బరిలో దిగిన ఆంధ్ర బాలుర జట్టు శుక్రవారం మహారాష్ట్ర జట్టుతో సాగిన ఉత్కంఠభరిత పోరులో పరాజయం పాలైంది. దీంతో అతిథ్య జట్టు టోర్నీ నుంచి వైదొలిగినట్లైంది. ఉత్తరాది క్రీడాకారుల ధాటికి దక్షిణాది ఆటగాళ్లు తాళలేకపోయారు.
సూపర్ లీగ్ పోటీల వివరాలు ఇలా...
సూపర్‌లీగ్ బాలుర విభాగంలో హర్యానపై ఆంధ్ర, కర్ణాటకపై మహారాష్ట్ర, మరో మ్యాచ్‌లో కర్ణాటకపై మధ్యప్రదేశ్ జట్లు భారీ విజయాన్ని నమోదు చేశాయి. ఏకపక్షంగా సాగిన ఈ పోటీల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క పాయింట్ కూడా దక్కకపోవడం గమనార్హం. ఇక పంజాబ్‌పై చత్తీస్‌ఘడ్ (1–9), మధ్యప్రదేశ్‌పై కేరళ (7–10), పంజాబ్‌పై హర్యానా (4–7), మహారాష్ట్రపై కేరళ (3–5) జట్లు గెలుపొందాయి.
బాలికల విభాగంలో ఒడిశాపై మధ్యప్రదేశ్ క్రీడాకారిణులు 6–0 పాయింట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌పై మహారాష్ట్ర (1–3), ఢిల్లీపై పంజాబ్ (2–3), ఒడిశాపై కేరళ (5–9), చండీఘడ్‌పై మధ్యప్రదేశ్ (1–6), ఢిల్లీపై మహారాష్ట్ర (1–9), చండీఘడ్‌పై కేరళ (6–17) జట్లు గెలుపొందాయి.
సెమీస్ విజేతలు వీరే..
సెమీస్‌లో తలపడిన బాలుర విభాగంలో ఆంధ్ర జట్టు క్రీడాకారులపై మహారాష్ట్ర క్రీడాకారులు ఆది నుంచి ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. ఉత్కంఠగా సాగిన పోరులో ఎనిమిది పాయింట్ల తేడాతో మహారాష్ట జట్టు గెలుపొందింది. కేరళపై జరిగిన ఆసక్తికర పోరులో చత్తీస్‌ఘడ్ క్రీడాకారులు భారీ విజయాన్ని నమోదు చేశారు. ఈ పోటీలో ప్రత్యర్థి జట్టుకు ఒక్కపాయింట్ కూడా దక్కకుండా చేసి ఫైనల్స్‌కు చేరుకుంది. శనివారం జరిగే తుదిపోరులో మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ జట్లు తలపడనున్నాయి. అలాగే బాలికల విభాగంలో కేరళపై పంజాబ్ (4–5), మహారాష్ట్రపై మధ్యప్రదేశ్ (2–8) జట్లు గెలుపొందాయి. బాలిక విభాగంలో తుదిపోరు పంజాబ్ మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరగనుంది.