
నేనేంటో నిరూపించుకుంటా
కోటవురట్ల: వర్ధమాన హీరో, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ సంక్రాంతి పండుగను తన స్వగ్రామం బి.కె.పల్లిలో కుటుంబ సభ్యుల నడుమ ఆనందంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన స్థానిక విలేకరులతో సరదాగా ముచ్చటించారు... అవి ఆయన మాటల్లోనే...
చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి...
పండగకు ఇక్కడకు రాగానే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. చిన్ననాటి స్నేహితులతో భుజాలపై చేతులు వేసి తీర్థంలో తిరగాలని ఆశగా ఉంది.. పండుగను అమ్మతో పంచుకోవడం సంతోషాన్ని కలిగించింది. ఈ సంతోషంలో గణి(నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర గణేష్) కూడా పాలు పంచుకున్నారు.
సినిమాలతో బిజిబిజీ
ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాను. ఈ రెండు సినిమాలు విశాఖ, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ‘వాడు నేను కాదు’ సినిమా విశాఖలో 40 రోజుల పాటు షూటింగ్ జరుపుకొంది. ఇంకా ఈ నెలాఖరు వరకు జరుగుతుంది. ఈ సినిమా 4 భాషల్లో రూపొందుతోంది.
అలాగే మరో సినిమా ‘అరకురోడ్డులో’ కూడా శరవేగంగా తయారవుతోంది. ఇంకా పేరుపెట్టని సినిమాలో శరత్‌కుమార్‌తో కలిసి నటిస్తున్నాను. వాడు నేను కాదులో లవ్, ఏక్షన్, మిస్టరీ మిళితమై ఉంటాయి. కాగా అరకు లోయలో సినిమా సస్పెన్స్ థ్రిల్లర్. ఈ రెండు సినిమాలు మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి. మరో కొత్త సినిమా ఫిబ్రవరి 12న ప్రారంభం కానుంది. దీంతో చేతినిండా సినిమాలతో ఈ ఏడాదంతా బిజీగా ఉన్నాను.
దర్శకత్వం చేయాలని..
నటుడిగా మంచి గుర్తింపు వచ్చాక దర్శకత్వం చేయాలని ఉంది. అన్నయ్య ఇచ్చిన 143తో లవర్‌బాయ్ ఇమేజ్ రాగా ‘బంపర్ ఆఫర్’ సినిమా మాస్ ఇమేజ్‌ను అందించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలన్నిటిలో కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే. అంతేకాదు ప్రొడక్షన్ రంగంలో కూడా నేనేంటో నిరూపించుకుంటా.