టమాట రైతు కన్నెర్ర
అనంతపురం రూరల్: టమాట రైతులు కన్నెర చేశారు. మార్కెట్లో రైతులకు జరుగుతున్న అన్యాయంపై ‘సాక్షి’ దిన పత్రికలో ‘‘ధర దగా’’ అన్న శీర్షికన సోమవారం కథనం వెలువడటంతో స్పందించి న రైతులు, రైతు సంఘాల నాయకులు మార్కెట్లో జరుగుతున్న దోపిడీకి నిరసనగా టమాటలను రోడ్డు పై పడేసి వాహనాలతో తొక్కించి నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే టమాటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం నాయకులు 44వ జాతీయ రహదారిని దిగ్బంధించా రు.
ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు (సీపీఎం) పెద్దిరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి (సీపీఐ) కాటమయ్య, రాప్తాడు వైఎస్ ఎంపీపీ గవ్వల పరంధామలు మాట్లాడుతూ కేవలం 15 రోజుల వ్యవధిలోనే రూ.300 ధర ఉన్న 15 కిలోల టమాట బాక్స్‌ను మార్కెట్ మండీ నిర్వాహకులు, వ్యాపారస్తులు సిండికేట్‌గా ఏర్పడి కేవలం రూ.30 కు కొనుగోలు చేస్తూ రైతుల కడుపుకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం మార్కెట్లో చౌకగా కొనుగోలు చేసి మదనపల్లి, కోలార్ మార్కెట్లలో అధిక ధరలకు విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. సిండికేట్ మాయపై అధికారులు విచారణ జరిపి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రాస్తా రోకో విషయం తెలుసుకున్న డీఎస్పీ మల్లికార్జున వర్మ అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించి , సమస్యను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో బుక్కచెర్ల సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, రైతు సంఘాల నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, రామాంజినేయులు, రామక్రిష్ణ, వెంకటనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఐజీ
రెండు గంటలకు పైగా సాగిన రాస్తారోకోతో జాతీయ రహదారిలో దాదాపు 2 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఇటు ప్రయాణికులు, అటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాప్తాడు నుంచి అనంతపురం వైపు వస్తున్న ఐజీ ఆర్‌కే మీనా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అరగంట పాటు రాప్తాడు పోలీసులు శ్రమించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.