కూరగాయల పంటల్లో యాజమాన్యం
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుతం జిల్లాలో సాగులో ఉన్న కూరగాయలు, పూలతోటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు.
సమగ్ర సస్యరక్షణ చర్యలు :
+ టమాట, వంగ తోటల్లో పూత, పిందె రాలకుండా, పిందె బాగా కట్టడానికి వీలుగా 1 మి.లీ ప్లానోఫిక్స్ 10 లీటర్ల నీటికి కలిపి పూత, కాయ దశల్లో 15 రోజుల వ్యవధిలో ఒకసారి అవసరమైతే రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
+ రబీ ఉల్లికి సంబంధించి గడ్డలు తయారైతే (50 శాతం మొక్కల ఆకులు ఎండిపోయినట్లు గమనిస్తే) గడ్డలు తవ్వి ఆరబెట్టి జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి.
+ ఏప్రిల్‌లో మునగకు ఆకుతొలుచు, గొంగళి పురుగు ఎక్కువగా ఆశించి నష్టం కలిగించే అవకాశం ఉంది. ముందుగానే చెట్టు చుట్టే దున్ని నేలలో ఉన్న ప్యూపాలను నాశనం చేసుకోవాలి.
+ చామంతి పూల తోటల్లో మొక్కలను నేలకు దగ్గరగా కత్తిరించి తడి ఇచ్చి కొంతవరకు సేంద్రియ ఎరువులు వేయాలి. కత్తిరించిన భాగం నుంచి పిలకలు వస్తే వాటిని మళ్లీ నాటేందుకు ఉపయోగపడుతాయి. అలా కాకుండా పంట తీసేసే ముందు కొత్త కత్తిరింపులను తీసుకుని నారుమడిలా పెంచుకోవచ్చు. నారుమడి పెట్టే ముందు కొమ్మ కత్తిరింపులకు 1 గ్రాము కార్బండిజమ్ ఒక లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలి. కత్తిరింపులకు వేర్లు బాగా రావాలంటే ఐబీఏ 2500 పీపీఎం ద్రావణంలో లేదా సెరాడెక్స్‌లో ముంచి నారుమడిలో నాటుకోవాలి.
+ లిల్లీ పూలను తామర పురుగులు, పేనుబంక, మొగ్గతొలుచు పురుగు, నిమటోడులు (నులిపురుగులు) ఆశించే అవకాశం ఉంది. వీటి వ్యాప్తికి కారణమయ్యే రసంపీల్చు పురుగుల నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 2 మి.లీ క్వినాల్‌ఫాస్ లేదా 3 గ్రాములు కార్బరిల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నులిపురుగుల నివారణకు ఫ్యురడాన్ గుళికలు ఎకరాకు 8 నుంచి 10 కిలోలు భూమిలో తడి ఉన్నపుడు వేయాలి. లిల్లీలో వాతావరణ పరిస్థితులను అనుసరించి కాండంకుళ్లు తెగులు, పూమొగ్గ కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉంది. నివారణకు 1 గ్రాము కార్బండిజమ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.