ప్రత్యేక హోదా కోసం రేపు ప్రజాబంద్
కాకినాడ సిటీ:
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం, రాష్ట్రంలోని పాలక పార్టీలు బీజేపి, టీడీపిలు అవలంబిస్తున్న ధోరణిని నిరసిస్తూ మంగళవారం ప్రజాబంద్‌కు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. స్థానిక సుందరయ్యభవన్‌లో ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జి సంయుక్తంగా ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 2వ తేదీన జరిగే రాష్ట్ర బంద్‌కు జిల్లాలో ఉన్న అన్ని వాణిజ్య, వ్యాపార వర్గాలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ, కార్మిక, కర్షకులు, ప్రజలు, ప్రజాసంఘాలు సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలోనూ, తరువాత ఇచ్చిన హామీలను పక్కనపెట్టి పాలకపార్టీలు రాష్ట్ర ప్రజలను దగా చేశారని విమర్శించారు. గతంలో నేరుగా కేబినేట్ తీర్మానంతో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారని, ఎక్కడా చట్టం చేయలేదని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి కుంటిసాకులు చెబుతున్నారన్నారు. ఆవిషయం విభజన చట్టంలో పొందుపరచ లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ తెలుగుదేశం, బీజేపీ దొంగనాటకాలు ఆడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమానికి కలిసిరావాలని, అన్ని పక్షాలను కలుపుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి కేంద్రంపై తీవ్ర వత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సీపీఎం కాకినాడ నగర కార్యదర్శి పలివెల వీరబాబు, సీపీఐ కాకినాడ నగర, రూరల్ కార్యదర్శులు తోకల ప్రసాద్, నక్కా కిషోర్ పాల్గొన్నారు.