-
ప్రతి ఒక్కరూ సహకరించాలి
-
ప్రత్యేక హోదాపై దగాకు నిరసన తెలపాలి
-
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు పిలుపు
-
కాకినాడలో పార్టీ జిల్లా కమిటీ అత్యవసర సమావేశం
కాకినాడ :
ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను మరోసారి దగా చేసిన తెలుగుదేశం, బీజేపీల తీరుకు నిరసనగా.. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 2వ తేదీన నిర్వహించనున్న రాష్ట్రబంద్‌ను.. జిల్లాలో విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ సహా వామపక్షాలను కలుపుకుని వెళ్తామని చెప్పారు. బంద్ పిలుపు నేపథ్యంలో స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం జరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా అత్యవసర సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, సీజీసీ సభ్యులు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. బంద్ విజయవంతం చేసే అంశంపై సమీక్షించారు. అమలాపురం, రాజమండ్రి, కాకినాడతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా పార్టీ నాయకులు ఎక్కడికక్కడ కాంగ్రెస్, వామపక్ష నేతలతో మాట్లాడి వారి మద్దతుతో బంద్‌ను విజయవంతం చేయాలని
తీర్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వద్ద తన పరపతిని కాపాడుకోవడానికి, కేసుల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ప్రత్యేక హోదాపై తెలుగుదేశం, బీజేపీలు ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని పార్లమెంటులో బీజేపీ తాజాగా చెప్పినా.. గట్టిగా అడగలేని స్థితిలో రాష్ట్ర సర్కారు ఉందని మండిపడ్డారు. ఒకప్పుడు ప్రత్యేక హోదా కోసం ప్రగల్భాలు పలికిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు మాట తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకవైపు టీడీపీ నేతలు బీజేపీపై నిందలు వేస్తూ కేంద్రంలో కొనసాగుతున్నారని.. రాష్ట్రంలో టీడీపీని తిడుతూ బీజేపీ మంత్రి పదవులు అనుభవిస్తోందని, ఇదంతా ఎవరిని మభ్యపెట్టడానికి కన్నబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారానే రెవెన్యూ లోటు భర్తీతో పాటు ప్రత్యేక గ్రాంట్లు, పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ, గుంటూరుల్లో దీక్షలతోపాటు అనేక ఉద్యమాలు చేశారన్నారు. రాజకీయ అవసరాల కోసం కాకుండా తెలుగు జాతి భవిష్యత్తు కోసం, ఐదు కోట్ల ఆంధ్రుల కోసం తమ పార్టీ ఉద్యమానికి సన్నద్ధమవుతోందన్నారు. బంద్‌ను అణచివేసేందుకు టీడీపీ సర్కారు ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామన్నారు. అరెస్టులు, నిర్బంధాలకు భయపడేది లేదన్నారు. సోమవారం అన్ని పట్టణ, మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. మంగళవారం బంద్ పాటిస్తామన్నారు.
కలిసివచ్చే అందరినీ కలుపుకొని..
మంగళవారంనాటి బంద్‌కు అన్ని వర్గాలూ సహకరించాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు. ఉద్యమానికి కలిసివచ్చే రాజకీయ పార్టీలు, వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలు, ఉద్యోగ సంఘాలు సహా అందరినీ భాగస్వాముల్ని చేసి ఉద్యమిస్తామన్నారు. ఆర్టీసీ బస్సులను కూడా నిలుపు చేస్తామన్నారు. అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇస్తామని చెప్పారు.
వైఎస్ విగ్రహం తొలగింపు కుట్రపూరితం
విజయవాడలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని చంద్రబాబు సర్కారు కుట్రపూరితంగా తొలగించిందని సమావేశంలో పార్టీ నేతలు మండిపడ్డారు. విగ్రహం తొలగింపును సమావేశం తీవ్రంగా ఖండించింది. విగ్రహాలను తొలగించగలరు కానీ ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్సార్‌ను చెరపలేరని బోస్, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు అన్నారు. చంద్రబాబు సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని అందుకే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, వేగుళ్ల లీలాకృష్ణ, తోట సుబ్బారావునాయుడు, పితాని బాలకృష్ణ, గిరజాల బాబు, ముత్యాల శ్రీనివాస్, పర్వత ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, వట్టికూటి సూర్యచంద్ర రాజశేఖర్, కర్రి నారాయణరావు, గుత్తుల సాయి, రావు చిన్నారావు, లింగం రవి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగిన సింహాద్రి, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, యువజన విభాగం, మైనార్టీ సెల్, రైతు, బీసీ, విద్యార్థి సంఘాల అధ్యక్షులు అనంత ఉదయ భాస్కర్, అబ్దుల్ బషీరుద్దీన్, జిన్నూరి వెంకటేశ్వరరావు, మట్టపర్తి మురళీకృష్ణ, జక్కంపూడి కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అత్తిలి సీతారామస్వామి, సఖినేటిపల్లి, మామిడికుదురు కన్వీనర్లు జిల్లేళ్ల బిన్ని సుధాకర్, బొరిశెట్టి భగవాన్, పార్టీ నాయకులు ఎండీ ఆరీఫ్, గొలిశెట్టి భగవాన్ పాల్గొన్నారు.