మాట్లాడుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
- వైఎస్ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
- పథకాల పేరు మార్చి పబ్బం గడుపుతున్నారు
- ప్రజలకు అండగా శ్రేణులు ఉద్యమించాలి
- జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది
- లోటస్‌పాండ్ సమావేశంలో జిల్లా నేతలకు దిశానిర్దేశం
సాక్షిప్రతినిధి, ఖమ్మం:
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తోందని, దీనిని నిరసిస్తూ పార్టీ తరఫున పోరుబాట పట్టాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నేతలు జిల్లాపార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం రాజధానిలోని లోటస్‌పాండ్‌లో పార్టీ ఖమ్మం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అ«ధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మెండెం జయరాజు, సేవాదళ్ అధ్యక్షుడు రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది ప్రజాప్రతినిధులు, నేతలు పార్టీని వీడినంత మాత్రాన నష్టమేమీలేదని, జిల్లాలో పార్టీ బలంగా ఉందన్నారు. జిల్లాలో పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. కానీ ప్రసుత్తం ప్రభుత్వం పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తోందని, వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. అలాగే దూరదృష్టితో వైఎస్.జలయజ్ఞం కింద జిల్లాలో తీసుకున్న ప్రాజెక్టుల పేరును ప్రభుత్వం మార్చి వాటిని ముందుకు సాగకుండా చూస్తోందన్నారు. వీటిపైనే పార్టీ శ్రేణులు దృష్టి పెట్టి, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఉద్యమించాలన్నారు. ప్రజలకు అండగా ఉండి పోరాడి.. పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా నేతలు, శ్రేణులు చేపట్టే కార్యక్రమాలకు రాష్ట్ర పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజల్లో ఉండి కష్టపడిన వారికే గుర్తింపు ఉంటుందని చెప్పారు. త్వరలోనే పార్టీ జిల్లా కమిటీతోపాటు అనుబంధ సంఘాల బాధ్యుల నియామకాలు కూడా చేపడతామన్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు తరలివెళ్లారు. జిల్లా నేతలు జిల్లపల్లి సైదులు, మందడపు వెంకటేశ్వర్లు, ఆలస్యం సుధాకర్, సంపెట వెంకటేశ్వర్లు, వాలూరి సత్యనారాయణ, రాములు, ఎస్‌కె.కరీం, ఎస్‌కె.మీరా, మర్రి బాబూరావు, గనపారపు వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ జ్యోతి, ఏసురత్నం, రమేష్‌బాబు, పులి సైదులు, రుద్ర హనుమంతరావు, రుద్ర ఉపేందర్, రేవతి, జయమ్మ, కుర్తం సత్యనారాయణ, ఉదయ్‌కుమార్, తాళ్లూరి శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.