ట్రాఫిక్ చక్రబంధంలో గొల్లపూడి
గొల్లపూడి (విజయవాడ రూరల్) :
గొల్లపూడి గ్రామంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకూ జఠిలమవుతోంది. ఈ గ్రామం విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఉండటంతో గ్రామస్తులకు ప్రాణసంకటంగా మారింది. ముఖ్యంగా మైలురాయి సెంటర్, వన్ సెంటర్, సారాకొట్టు సెంటర్‌లో ప్రజలు రోడ్డును క్రాస్‌చేసి ఆవలి వైపునకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. మైలురాయి సెంటర్‌లో ఈ సమస్య అధికంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ వైపునుంచి వచ్చే వాహనాలు, బైపాస్‌రోడ్డులో విజయవాడ నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి మైలురాయి సెంటర్‌వద్ద క్రాస్ అవుతాయి. అదే ప్రాంతంలో భవానీపురం నుంచి వచ్చే బస్సులు, ప్రభుత్వ వాహనాలు రోడ్డును క్రాస్ చేసుకుని వెళ్లాల్సి రావడంతో నిత్యం చిన్నచిన్న రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తతో ఉన్నా ప్రమాదం పొంచి ఉందన్నమాటే. పోలీసు అవుట్ పోస్టు ఉన్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు లారీలను బైపాస్ రోడ్డుకు పంపేందుకు సూచికలు చూపిస్తున్నారే తప్ప విజయవాడ వైపునుంచి (టీటీడీసీ)వైపు నుంచి వచ్చే వాహనాలకు ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వడంలేదు. అదేవిధంగా వన్ సెంటర్‌లో క్లాస్ వన్ పీపుల్స్ ఉంటారు. ప్రతి కుటుంబానికి రెండు కార్లు, మూడు బైక్‌లు ఉంటాయి. రోజూ ఉదయం సాయంత్రం ట్రాఫిక్ రద్దీ చెప్పనలవి కాదు. మొన్నటి వరకు రాష్ట్రనీటి పారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ సెంటర్‌కు దగ్గరలో ఉండటం వలన ట్రాఫిక్ పోలీసులు ఉండేవారు. ప్రస్తుతం ఆయన విజయవాడలో ఉండడంతో పోలీసులు కనిపించడం లేదు. సారాకొట్టు సెంటర్ మాస్ పీపుల్స్ సెంటర్. సాయంత్రం అయ్యిందంటే సెంటర్ కిటకిటలాడుతోంది. హోటల్స్, టిఫిన్స్ అమ్ముకొనేవారు అక్కడే ఉండడంతో ఎలాంటి వాహనాలైనా అక్కడ ఆగాల్సిందే. ఇరుకైన సెంటర్ కావడం తో సహజంగా ఉండాల్సిన ట్రాఫిక్ కం టే ఎక్కువగా సమస్య ఉంటుంది. సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజాప్రతినిధులను గామస్తులు కోరుతున్నారు.