పండగ పూట విషాదం
పండగ పూట విషాదం
Published Wed, Apr 5 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM
- ఫ్యూజ్ వేయబోయి మృత్యువాత
- పెట్నికోట గ్రామంలో ఘటన
కొలిమిగుండ్ల: శ్రీరామనవమి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాల్సిన ఆ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఫ్యూజ్ వేయబోయి ఓ యువకుడు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. పెట్నికోట ఎస్సీ కాలనీకి చెందిన మగదాల సుబ్బరాయుడుకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సురేంద్రబాబు(28) స్వంతంగా నాపరాతి పాలీష్ ప్యాక్టరీ నిర్మించుకొని కుటుంబానికి అండగా ఉన్నాడు. మూడు రోజుల క్రితం పెట్నికోటలో పెనుగాలుల బీభత్సానికి స్తంభాలు, చెట్లు విరిగి పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సురేంద్రబాబు ప్యాక్టరీకి చెందిన ట్రాన్స్‌ఫార్మర్‌లో ఎగ్జ్‌ఫ్యూజ్ పోవడంతో సరఫరా నిలిచి పోయింది. ఉదయం ఆరున్నర గంటల సమయంలో ప్యాక్టరీ వద్దకు వెళుతుంటే కుటుంబ సభ్యులు కాఫీ తాగి వెళ్లమని సూచించినా త్వరగా వస్తానని వెళ్లాడు.
ఏదో ఆలోచనలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను బంద్ చేయకుండా ఎక్కి ఫ్యూజ్ వేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ట్రాన్స్‌కో ఏఈ సూర్యనారాయణరెడ్డి, లైన్ ఇన్‌స్పెక్టర్ జయనాయక్ .. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. హెడ్‌కానిస్టేబుల్ బాబాఫకృద్దీన్ వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు.
Advertisement