ఖజానాకు లిక్కర్ కిక్కు!
8 నెలల్లో రూ.7,793 కోట్ల రెవెన్యూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు మద్యం ఫుల్లుగా కిక్కు ఇస్తోంది. ఈ ఏడాదికిగాను నవంబర్ నెలాఖరు వరకు (8 నెలల్లో) మద్యం అమ్మకాలు, ఇతర మార్గాల ద్వారా ఎక్సైజ్ శాఖ రూ.7,793 కోట్ల రెవెన్యూ సమకూర్చుకుంది. అంచనాల ప్రకారం రూ. 8,075 కోట్లు రావాల్సి ఉండగా... రూ. 300 కోట్లు మాత్రమే తక్కువగా ఉంది. మరోవైపు ఇదే సమయంలో వాణిజ్య పన్నుల శాఖకు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం భారీగా తగ్గిపోయింది. పన్నుల వసూళ్లు పెంచుకునేందుకు అధికార యంత్రాంగం చేస్తున్న కృషి ఫలితాలను ఇవ్వడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు, గుట్కాపై నిషేధం వంటి కారణాలతోనూ ఆదాయానికి కోత పడుతోంది. ఇక 12 వాణిజ్య పన్నుల శాఖ డివిజన్లలో సగానికి కూడా లక్ష్యానికి అనుగుణంగా పనిచేయడం లేదు. మొత్తంగా వాణిజ్య పన్నుల శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 36,000 కోట్ల ఆదాయ లక్ష్యం పెట్టుకోగా... నవంబర్ నెలాఖరు వరకు వచ్చింది రూ. 20,902 కోట్లు మాత్రమే.
‘మద్యం’ లక్ష్యం రూ. 12,207 కోట్లు
2015-16లో మద్యం అమ్మకాలు, లెసైన్సుల ద్వారా రూ. 12,207 కోట్లు సమకూర్చుకోవాలని ఆబ్కారీ శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎనిమిది నెలల్లో ఎక్సైజ్ శాఖకు రూ. 7,793 కోట్లు ఆదాయం రాగా, అందులో వ్యాట్ కింద రూ. 5,194 కోట్లు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా సర్కారు ఖజానాకు చేరింది. వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేసే పన్నుల్లో సింహభాగం ఇదే కావడం గమనార్హం.