ఖజానాకు ‘మద్యం’ కిక్కు!
• రాష్ట్రంలో భారీగా పెరిగిన ఆదాయం
• ఏప్రిల్ నుంచి జూలై వరకు
• రూ.4,729 కోట్ల రెవెన్యూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ఖజానాకు ప్రధాన ఆదాయవనరుగా ఉన్న ఆబ్కారీ శాఖ రెండేళ్లుగా మద్యం అమ్మకాల్లో భారీగా వృద్ధి సాధిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల పాటు మద్యం అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఈ సమయంలో ఏకంగా 23.61 శాతం వృద్ధి సాధించింది. 11.83 శాతంతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక నిలి చాయి. ఈ నాలుగు నెలల్లో రాష్ట్ర ఆబ్కారీ శాఖకు వచ్చిన రెవెన్యూ రూ.4,728.57 కోట్లు. అయితే తమిళనాడు, కర్ణాటకల్లో తెలంగాణ కన్నా రెవెన్యూ ఎక్కువగా ఉన్నా... వృద్ధిరేటులో మూడేళ్లుగా అవి చివరి స్థానాల్లోనే ఉన్నాయి. గత (2015-16) ఆర్థిక సంవత్సరంలో కూడా తెలంగాణ 19.16 శాతం ఎక్సైజ్ రెవెన్యూ వృద్ధితో మొదటి స్థానంలో ఉండడం గమనార్హం.
ఐఎంఎల్ అమ్మకాల్లో భారీగా..
తెలంగాణలో ఐఎంఎల్ (దేశీ తయారీ మద్యం) అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. 2014-15తో పోల్చితే 2015-16లో 18.24 శాతం వృద్ధితో 2.38 కోట్ల కేసుల ఐఎంఎల్ విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లోనే ఏకంగా 30.19 శాతం వృద్ధితో 85.47 లక్షల కేసులను విక్రయించారు. ఇదే సమయంలో బీర్ల అమ్మకాల్లో 1.31 కోట్ల కేసులతో 8.73 శాతం పెరుగుదల నమోదైంది. ఆంధ్రప్రదేశ్ బీర్ల అమ్మకాల్లో 14.18 శాతం వృద్ధితో తొలిస్థానంలో నిలవగా.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది.
• సమగ్ర ఎక్సైజ్ పాలసీ రూపొందించాలి
• కల్లుగీత పనివారల సంఘం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే అక్టోబర్‌లో ప్రారం భం కానున్న ఎక్సైజ్ (కల్లుగీత) పాలసీని సమగ్రంగా రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పనివారల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.రాష్ట్రంలో మూతపడిన కల్లు దుకాణాల లెసైన్స్‌లను పునరుద్ధరించి, శాశ్వ త ప్రాతిపదికన లెసైన్సులు ఇవ్వాలని కోరింది. కల్లుగీత వృత్తిని ఆధునీకరించాలని, ఆహార, ఆహారేతర ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పాలని, ట్యాంక్‌బండ్‌పై ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, గీతవృత్తిదారుల నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శనివారం సంఘ అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీర్మానించారు. ఈ నెల, సెప్టెంబర్‌లలో గీతవృత్తిదారులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్, తహసీల్దార్, కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ, ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. సమావేశం లో డీజీ సాయిలుగౌడ్, పి.రాములు, పబ్బు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.