చెంచుల సమావేశంలో మాట్లాడుతున్న ఈఓ నారాయణ భరత్ గుప్త
మల్లన్న చెంతకు చెంచులు
Published Tue, Sep 27 2016 11:57 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
– గిరిజన చెంచులకు పూర్వవైభవం తెచ్చేలా ఈఓ కృషి
– సౌకర్యాలు, దర్శనంలో ప్రాధాన్యత
– చెంచులక్ష్మీ కల్యాణపథకం కింద ఘనంగా వివాహం
– అర్చకత్వంలో శిక్షణ, భజన బందాలకు చేయూత
దట్టమైన నల్లమల అటవీ కీకారణ్యం మధ్య నెలకొన్న శ్రీభ్రమరాంబాసమేత మల్లికార్జునస్వామివార్లను చెంచులు తమ దైవంగా భావించేవారు. తమకు పుట్టిన పిల్లలకు చెంచు మల్లయ్య, చెంచు మల్లమ్మ అని పేర్లు పెట్టుకునే వారు. పూర్వం మహాశివరాత్రి పర్వదినం నాడు స్వామిఅమ్మవార్లకు తమ గిరిజన పద్ధతిలో కల్యాణోత్సవాన్ని నిర్వహించే వారని, అలాగే శ్రీభ్రమరాంబాదేవికి జరిగే కుంభోత్సవం పూర్తిగా చెంచు గిరిజనులకే ఒకప్పుడు పరిమితమైంది. కాలానుగుణ పరిస్థితులలో భాగంగా నాగరికత అభివృద్ధి చెందడంతో చెంచులను మల్లన్నకు నాగరీకులు దూరం చేశారని చెప్పవచ్చు. అయినప్పటికీ నేటికి స్వామివార్ల కల్యాణోత్సవ పల్లకీని ప్రతి నిత్యం మోసేది చెంచులే. అలాంటి చెంచులకు ఈఓ నారాయణభరత్ గుప్త మల్లన్న ఆలయంలో ప్రాధాన్యత ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.
– శ్రీశైలం
శ్రీశైల మల్లన్నకు చెంచుల మధ్య అనుబంధాన్ని తెలుసుకున్న ఈఓ నారాయణ భరత్ గుప్త వారికి దేవస్థానం తరుపున గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐటీడీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ ఎల్. భాస్కరరావు, శివాజీస్ఫూర్తి కేంద్రం పర్యవేక్షకులు ఎ. వంశీకష్ణ, కర్నూలు జిల్లా సమరసత ఫౌండేషన్ కన్వీనర్ బాలిశెట్టి బాలసుబ్రమణ్యం, శ్రీశైల మండల ప్రతినిధి సంజీవరావులతో కలిసి వివిధ చెంచుగూడాలల చెంచు గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ చెంచులకు దేవస్థానం చేపట్టనున్న పలు అంశాలపై అవగాహన కల్పించారు. అవగాహన సదస్సుకు హాజరైన ప్రతి చెంచుగిరిజనుడికి ఈఓ నారాయణభరత్ గుప్త స్వామివార్ల లడ్డూ ప్రసాదాలు, శేషవస్త్రాలు, దివ్యపరిమళ విభూతి, శ్రీచక్రపూజ కుంకుమ, కైలాస కంకణాలను అందజేశారు. ఆ తరువాత స్వామివార్లకు అభిషేకం, స్పర్శదర్శనంతో పాటు అమ్మవారి దర్శనం, భోజన వసతి సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో దేవస్థానం వివిధ విభాగాల సిబ్బంది, స్వామివార్ల ప్రధానార్చకులు, అర్చకులు , కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల చెంచుగూడాల నుంచి వచ్చిన చెంచులు, పాల్గొన్నారు.
చెంచులకు వర్థించే పథకాల వివరాలు:
చెంచుల వివాహ సమయంలో దేవస్థానం స్వామిఅమ్మవార్ల ఆశీర్వచనంగా చెంచులక్ష్మీ కల్యాణ పథకం ప్రవేశపెడుతున్నారు. ఈ పథకంలో వివాహానికి దేవస్థానం కల్యాణమండపంతో పాటు వ««దlూవరులకు నూతన వస్త్రాలు, తాళిబొట్లు, మెట్టెలు అందజేస్తుంది.
– వధూవరులతో వచ్చిన బంధువర్గానికి దేవస్థానం ఉచిత వసతి సదుపాయం, వివాహ భోజనం ఏర్పాటు చేస్తారు.
– వివాహం రోజున నూతన వధూవరులచే స్వామివార్లకు అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించే అవకాశం.
– ఈ సౌకర్యాలకు చెంచులు ఐటీడీఏను సంప్రదించాల్సి ఉంది.
– ఆయా చెంచుగూడాలలోని ఆలయాలలో అర్చకత్వాన్ని నిర్వహింపజేసేందుకు ఆసక్తిగల చెంచులకు దేవస్థానం తరుపున తగిన శిక్షణ ఇస్తుంది.
– చెంచుగూడాలలో భక్తులు, భజన బందాలు ఏర్పడితే అలాంటి బందాలకు హార్మోనియం, తబలా, భజన తాళాలు తదితర వాటిని దేవస్థానం సమకూరుస్తుంది.
– దేవస్థానం నిర్వహించే కళా పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి రూ. 10వేలు, రెరండవ బహుమతి రూ. 8వేలు, మూడవ బహుమతి రూ. 5వేలు పారితోషికంగా అందజేస్తారు. పోటీలో పాల్గొన ప్రతి బందానికి రూ. 2వేలు ఇవ్వనున్నారు.
– చెంచులు ఎప్పుడు ఆలయాన్ని సందర్శించినప్పటికీ వారికి ఉచిత దర్శనం కల్పిస్తారు. ఇందుకు ఐటీడీఏ ద్వారా గుర్తింపు పొందిన చెంచులు ఆ సంస్థ ద్వారా గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement