యువభేరిని విజయవంతం చేద్దాం
తణుకు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న ఏలూరులో నిర్వహించనున్న యువభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు విద్యార్థులకు, యువతకు పిలుపునిచ్చారు. సోమవారం తణుకులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగం నాయకులతో భేటీ అయ్యారు. జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి విద్యార్థులు పాల్గొనేలా ప్రణాళికలు చేయాలన్నారు. మండల, జిల్లాస్థాయిల్లో విద్యార్థి సంఘాల నాయకులను సమీకరించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం ద్వారానే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తించాలని కోరారు. గ్రామస్థాయిలో విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలని పార్టీ నేతలను కోరారు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లంకపల్లి డేవిడ్, పి.అఖిల్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు జీపీ శ్రావణ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులు కె.దినేష్‌రెడ్డి, డి.రవీంద్ర పాల్గొన్నారు.