పీఎంపీ కుటుంబానికి న్యాయం చేయాలి
Published Sat, Sep 3 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : ఇటీవల చింతలపూడి నియోజకవర్గంలో హత్యకు గురైన ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ ధారావతు నాగేశ్వరరావు కుటుంబానికి న్యాయం చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు భూక్యా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక లంబాడీ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చింతలపూడి మండలం పట్టాయగూడెంలో 20 సంవత్సరాలుగా నాగేశ్వరరావు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని, రెండు సంవత్సరాల క్రితం ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అతనిపై దాడికి పాల్పడగా నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెద్దలు చర్చలు జరిపి రాజీ చేశారని తెలిపారు. అయితే అప్పటి నుంచి నాగేశ్వరరావుపై కక్ష కట్టిన ఆ గ్రామానికి చెందిన అగ్రకులాలకు చెందిన వ్యక్తులు గత నెల 11న పట్టాయగూడెంకు రెండు కిలోమీటర్ల దూరంలోని అడవిలోకి తీసుకువెళ్లి దారుణంగా హత్య చేశారని తెలిపారు. దీనిపై చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆరోపించారు. బాధితుడికుటుంబానికి న్యాయం చేయాలని, నాగేశ్వరరావును హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సమావేశంలో సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడిత్యా శ్రీనివాస నాయక్, సంయుక్త కార్యదర్శి ధారావతు కీమ్యా నాయక్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement