రోడ్డెక్కిన ట్రైసైకిళ్లు
-
ప్రారంభించిన నగర మేయర్
-
రామగుండం బల్దియాలో ఇంటింటా చెత్త సేకరణ షురూ..
కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నాలుగు నెలలుగా మూలకుపడిన ట్రై సైకిళ్లు ఎట్టకేలకు శుక్రవారం రోడ్డెక్కాయి. గత నెల 27న ‘రూ.35 లక్షలు వథా’ శీర్షికతో ట్రై సైకిళ్ల నిర్లక్ష్యంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాలకవర్గంలో కదలిక వచ్చింది. ఫలితంగా ఇంటింటికి చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రై సైకిళ్లను నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రారంభించారు. ఇంటింటికీ చెత్త సేకరించడలో పారిశుధ్య సేవకులు నిర్లక్ష్యం చేయొద్దన్నారు. చెత్త రహిత రామగుండం... స్వచ్ఛ రామగుండం లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం ఆదర్శంగా నిలవడానికి పారిశుధ్య సేవకులు పని చేయాలని సూచించారు. జీవనభతి కోసం పారిశుధ్య సేవకులు ఇంటింటికీ రూ.40 చొప్పున తీసుకోవాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చెత్త సేకరించే పనులు పూర్తి చేయాలన్నారు. కమిషనర్ డి.జాన్‌శ్యాంసన్ మాట్లాడుతూ... చిత్తశుద్ధితో పని చేయాలని, కార్మికులు చేస్తున్న పనిని ప్రతీ రోజూ ఫొటోలను ఆన్‌లైన్‌లో ప్రధాన మంత్రికి పంపించడం జరుగుతుందన్నారు. అనంతరం కార్మికులకు యూనిఫాం, మాస్క్‌లు, చేతి తొడుగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మారుతి, సోమారపు లావణ్య, దాసరి ఉమాదేవి, తానిపర్తి గోపాలరావు, చుక్కల శ్రీనివాస్, నాయిని భాగ్యలక్ష్మీ, షేక్‌బాబుమియా, చిట్టూరి రాజమణి, బక్కి రాజకుమారి, జనగామ నర్సయ్య, పీచర శ్రీనివాసరావు, కోదాటి తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.