హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత పాలక మండలిని మరో ఏడాది కాలం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ చైర్మనుగా, మరో 18 మందిని సభ్యులుగా ఏడాది కాలానికి టీటీడీ పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం గతేడాది ఏప్రిల్ 27వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ చట్టం ప్రకారం పాలక మండలి పదవీ కాలం రెండేళ్లపాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పాత కమిటీనే మరో ఏడాది కాలం పొడిగిస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ జీవో నంబరు 188 జారీ చేశారు. దీనికి ముందే టీటీడీ ప్రస్తుత పాలక మండలి నుంచి తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే జి.సాయన్నను పాలక మండలి సభ్యత్వం నుంచి తప్పిస్తూ శనివారం జీవో జారీ చేశారు. సాయన్న తెలంగాణలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.