
పాము వెంటాడింది.. విధి వెక్కిరించింది
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు దుర్మరణం
నాగర్‌కర్నూల్ సమీపంలో దుర్ఘటన
పాము వెంటాడింది.. విధి వెక్కిరించింది. పాము కరిచిందని ఓ తల్లి తన కన్నపేగును బతికించుకునేందుకు వైద్యం కోసం వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తోంది. మరో పది నిమిషాలయితే తన కంటిరెప్పను కాపాడుకునేదేమో..! ఆ క్షణం ఆగితే కొడుకు దక్కేవాడేమో..! ఇంతలో యముడేదో తరిమినట్లు.. ఉరిమేదో ఉరిమినట్లు కారు రూపంలో మృత్యువు తల్లీబిడ్డను కబళించింది. ఒడిలో బిడ్డ.. ఆ కుమారుడిని అదిమిపట్టుకున్న తల్లి విగతజీవులుగా మిగిలారు. ఈ సంఘటన అందరి హృదయాలను కలిచివేసింది.
నాగర్‌కర్నూల్ రూరల్: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతిచెందిన సంఘటన బుధవారం నాగర్‌కర్నూల్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామానికి చెందిన పగిడాల రేణుక(35)కు ఒక్కగానొక్క కొడుకు రాంచరణ్(6)ను మంగళవారం రాత్రి నిద్రిస్తున్న స మయంలో పాము కరిచింది. ఉదయం చూసిన తల్లి తన కొడుకును అదేగ్రామంలో ఓ నాటువైద్యుడి వద్దకు తీసుకెళ్లి చూపించింది.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తుఫాన్ వాహనంలో తీసుకెళ్తోంది. నాగర్‌కర్నూల్ సమీపంలో రెడ్డి హోటల్ వద్ద నాగర్‌కర్నూల్ నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఇండికా కారును వీరి వాహనం ఢీకొట్టింది. తుఫాన్ వాహనం ముందు ఎడమ వైపుటైరు ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో రేణుక, ఆమె కొడుకు చరణ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రేణుక తల్లి బాలమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. తుఫాన్ వాహనం క్లీనర్, డ్రైవర్ పరారయ్యారు. ఈ సంఘటనపై నాగర్‌కర్నూల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ గురుస్వామి సంఘటన స్థలానికి వెళ్లి శవాలను పోస్టుమార్టం కోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.