ఇరు వర్గాల ఘర్షణ
♦ ఏడుగురికి గాయాలు
♦ కావలికారు పోస్టు కోసం గొడవ
♦ సాయిపూర్‌లో పోలీస్ పికెట్
తాండూరు: పట్టణంలోని సాయిపూర్‌లో జరిగిన ఇరువర్గాల ఘర్షణలో ఏడుగురు గాయపడ్డారు. కావలికారు పోస్టుకోసం గొడవ జరిగింది. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇరువర్గాల ఘర్షణతో సాయిపూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. తాండూరు అర్బన్ ఎస్‌ఐ నాగార్జున్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన సంతోష్‌కుమార్ కుటుంబానికి చెందిన వారు ప్రస్తుతం కావలికారుగా ఉన్నారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆనవాయితీలో భాగంగా ఈసారి సదరు పోస్టు తమకు ఇవ్వాలని బంటు మల్లప్ప కోరుతున్నాడు. ఈ పోస్టు తమకే చెందాలని సంతోష్‌కుమార్ వర్గం స్పష్టం చేసింది. ఈ విషయమై కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతుంది. ఈక్రమంలో ఆదివారం ఉదయం సాయిపూర్ హనుమాన్ దేవాలయం వద్ద టీఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల నర్సింలు, నాయకుడు బాల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ నర్సింలు సమక్షంలో ఇరువర్గాలు పంచాయతీ పెట్టారు. మాటామాట పెరగడంతో ఘర్షణ జరిగింది. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. సంతోష్‌కుమార్ వర్గానికి చెందిన పలువురు గాయపడ్డారు. మరోవర్గానికి చెందిన బంటు మల్లప్ప, హన్మప్పల తలకు తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం ఏడుగురు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న ఎస్‌ఐ నాగార్జున సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలకు చెందిన ఏడుమందిని అదుపులోకి తీసుకున్నారు. సంతోష్‌కుమార్, బంటుమల్లప్ప ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. సాయిపూర్‌లో పోలీసు పికెట్ ఏర్పాటు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.