సీసీ కెమెరాకు చిక్కిన అనుమానితులు
దుండిగల్: ఆన్ లైన్ లో రైలు టికెట్లు బుక్ చేయాలని వచ్చిన ఇద్దరు దుండగులు యువతి దృష్టి మళ్లించి రూ. 50 వేలు ఎత్తుకెళ్లారు. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం... గండిమైసమ్మ చౌరస్తాలో పుష్ఫక్ కమ్యూనికేషన్స్ పేరుతో ఆన్ లైన్ సర్వీస్ సెంటర్ ఉంది. శుక్రవారం సాయంత్రం 4.30కి ఇక్కడికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్ చేసుకొనేందుకు వచ్చామని కంప్యూటర్ ఆపరేటర్ విజయలక్షి్మకి చెప్పారు. అనంతరం తమ వద్ద వంద నోట్లు ఉన్నాయని, వాటికి బదులు 500 నోట్లు కావాలని కోరారు.
వారు 10 వంద రూపాయల నోట్లు ఇవ్వగా, విజయలక్ష్మి వారికి రెండు 500 నోట్లు ఇచ్చింది. అయితే, ఆ రెండు నోట్లు బాగాలేవని, వేరేవి ఇవ్వమని వారు పట్టబట్టారు. దీంతో తన వద్ద ఉన్న నోట్లన్నీ ఇలాగే ఉన్నాయని చెప్పి విజయలక్ష్మి క్యాష్ పెట్టెలో ఉన్న నోట్లను చూపించింది. అదే సమయంలో మరొకడు తమకు త్వరగా టికెట్లు బుక్ చేయాలని హడావుడి చేశాడు. చివరకు రైలు టికెట్లు బుక్ చేయకుండానే వెళ్లిపోయారు.
దీంతో విజయలక్ష్మి అనుమానం వచ్చి క్యాష్ పెట్టెలో ఉన్న నగదును చూసుకోగా...రూ.50 వేల బండిల్ కనిపించలేదు. వెంటనే బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఎస్‌ఐ రమేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు. అందులో నమోదైన అనుమానితుల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు.