
పరారీలో ఓటుకు కోట్లు కేసు నిందితులు!
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇవ్వజూపుతూ పట్టుబడిన ఓటకు కోట్లు కేసులో నిందితుల్లోని ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసులో కొండల్ రెడ్డి, జిమ్మిబాబులు నోటీసులు జారీ చేసినా.. వారు విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.
ఓ ముఖ్య నేత నివాసంలో కొండల్ రెడ్డి తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే జిమ్మిబాబు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నట్లు సమాచారం. జిమ్మిబాబుకు అవసరమైన ఆర్థిక సహాయం కూడా కొందరు నేతలు చేస్తున్నట్లు ఏసీబీకి సమాచారం అందినట్లు తెలుస్తోంది. మరో వైపు కొండల్ రెడ్డిని కూడా రాష్ట్రం దాటించేందుకు యత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఈ కేసులో నిందితులకు ఆశ్రయం కల్పిస్తున్న వారిపై తెలంగాణ ఏసీబీ దృష్టి సారించింది.