
పగలు రెక్కీ.. రాత్రి దోపిడీ
అనంతపురం సెంట్రల్ : పగలు రెక్కి నిర్వహించడం, రాత్రిళ్లు దోపిడీ చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. చోర విద్యలో ఎంత నైపుణ్యం సాధించినా చివరకు పోలీసుల వలకు చిక్కి కటకటాలపాలయ్యారు ఇద్దరు దొంగలు. అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మల్లికార్జునవర్మ మాట్లాడారు.
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం..
తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అనంతపురం అశోక్‌నగర్‌కు చెందిన షేక్ రషీద్, కనగానపల్లి మండలం మద్దెలచెరువుకు చెందిన మల్లేపల్లి ప్రభంజన్‌రెడ్డి అనే దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 40 తులాల బంగారు, 9 తులాలు వెండి, బైక్, ఎల్‌ఈడీ టీవీలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.13 లక్షలు ఉంటుంది.
చెడు వ్యసనాలతో దారి తప్పి..
తాగుడు, జూదం తదితర వ్యసనాలతో పాటు జల్సాలకు అలవాటు పడిన వీరు దొంగతనాలకు మరిగారు. గతంలో వైఎస్సార్ జిల్లాలోనూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇటీవల ఇద్దరూ కలిసి అనంతపురంలోని నందమూరినగర్, లక్ష్మీనగర్, భాగ్యనగర్, మండ్ల సుబ్బారెడ్డినగర్, జీసస్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఏడు దొంగతనాలు చేశారు. ఇళ్ల తాళాలు పగలగొట్టి విలువైన బంగారు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు.
నిఘా నుంచి తప్పించుకోలేకపోయారు
అనంతపురంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గట్టి నిఘా పెట్టారు. ఈసారి ఆ ఇద్దరు దొంగలూ తప్పించుకోలేకపోయారు. సాయినగర్‌లో దొంగలిద్దరూ ఉన్నట్లు అందిన పక్కా సమచారంతో గురువారం దాడి చేసి వారిద్దరినీ పట్టుకున్నారు. చైన్‌స్నాచింగ్ పాల్పడుతున్న ముఠానూ త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. టూటౌన్ సీఐ శుభకుమార్, ఎస్‌ఐలు జనార్దన్, క్రాంతికుమార్, శివగంగాధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.