ఉడకని అన్నం.. కుళ్లిన గుడ్లు
ఉడకని అన్నం.. కుళ్లిన గుడ్లు
Published Tue, Jan 24 2017 1:33 AM | Last Updated on Wed, Aug 29 2018 7:54 PM
తణుకు :మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దీనికి ‘మధురాన్నం’ అని నామకరణం చేసింది. వినడానికి ఈ పేరెంతో మధురంగా ఉన్నా.. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం నోట్లో పెట్టుకోలే నంత దారుణంగా ఉంటోంది. సేవ పేరుతో మధ్యాహ్న భోజన పథకం అమలును జిల్లా రైస్ మిల్లర్లకు ఉన్నతాధికారులు అప్పగించారు. గోదావరి విద్యావికాస్ చైతన్య సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో గల 35 పాఠశాలల్లో సుమారు 15 వేల మందికి భోజనం వండి పెట్టాలని నిర్ణయించారు. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఈ పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి రోజున గంటన్నర ఆలస్యంగా పాఠశాలలకు భోజనం చేరడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. రెండో రోజు అన్నం ఉడక్కపోవడంతో దానిని బయట పారబోశారు. సోమవారం విద్యార్థుల కోసం ఉడకబెట్టిన కోడిగుడ్లు కుళ్లిపోయాయి. రంగుమారి దుర్వాసన రావడంతో విద్యార్థులు వాటిని చెత్తకుప్పల్లో పడేశారు. తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం 585 మంది విద్యార్థులకు కోడిగుడ్లు ఉడకబెట్టి తీసుకురాగా.. ఈ పరిస్థితి తలెత్తింది.
ఇదేనా సేవ
పాఠశాలల్లోనే వంటలు చేసి వేడివేడిగా వడ్డించే డ్వాక్రా సంఘాలను కాదని.. సేవ పేరుతో ఈ పథకం అమలు బాధ్యతను గోదావరి విద్యావికాస్ చైతన్య సొసైటీకి అప్పగించారు. ఇందుకోసం బియ్యం, ఇతరత్రా సరుకులను అందజేస్తున్న ప్రభుత్వం.. భోజనం వండి వడ్డించినందుకు ఒక్కొక్క విద్యార్థిపై తలకు రూ.7.18 చొప్పున ఆ సంస్థకు నగదు ఇస్తోంది. ప్రస్తుతం 15 వేల మందికి భోజనం వండి వడ్డించే బాధ్యత తీసుకున్న చైతన్య సొసైటీకి రోజుకు సుమారు రూ.1.10 లక్షల చొప్పున నెలకు రూ.33 లక్షలు, ఏడాదికి రూ.4 కోట్లు ప్రభుత్వం నుంచి అందనున్నాయి. జిల్లా ఉన్నతాధికారుల అండదండలతో మొదటి దశలో ఏడు మండలాల్లో 35 స్కూళ్లల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను వీరికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోగా.. ఈనెల 20న పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిగూడెంలో వండిన పదార్థాలను ప్రత్యేక వాహనాల్లో పాఠశాలలకు చేరవేస్తున్నారు. అక్కడి నుంచి మారుమూల స్కూళ్లకు చేరాలంటే సుమారు 2 నుంచి 3 గంటలు సమయం పడుతోంది. అప్పటికే పదార్థాలు చల్లారిపోతుండటంతో మధ్యాహ్న భోజనంపై విద్యార్థులకు ఆసక్తి సన్నగిల్లుతోంది.
అంతా బూటకమే..
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు పరం చేస్తే సత్ఫలితాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే, 3 రోజులుగా పాఠశాలలకు అందుతున్న ‘మధురాన్నం’ పరిశీలిస్తే అదంతా బూటకమేనని అర్థమవుతోంది. రెండో రోజైన శనివారం సరఫరా చేసిన భోజనం ఉడక్కపోవడంతో తణుకు మండలం వేల్పూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బయట పారబోశారు. సోమవారం తణుకులోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు భోజనంతోపాటు వచ్చిన కోడిగుడ్లు కుళ్లి దుర్వాసన రావడంతో విద్యార్థులు వాటిని తినలేక చెత్తకుప్పల్లో పడేశారు.
బాబోయ్.. వాసనొచ్చేసింది
మధ్యాహ్న భోజనంలో ఈ రోజు కోడిగుడ్డు వేశారు. గుడ్డు ఒలిస్తే రంగు ఎర్రగా ఉంది. పరీక్షించి చూస్తే కుళ్లినట్టుంది. వాసన వచ్చింది. భయమేసి పడేశాను. నాతోటి మిత్రులు సైతం కోడిగుడ్లను పడేశారు.
– నవీన్, ఏడో తరగతి విద్యార్థి
గతంలోనే బాగుండేది
గతంలోనే భోజనం బాగుండేది. రెండ్రోజులుగా అన్నం బాగోవడం లేదు. మొన్న తెచ్చిన అన్నం ఉడకలేదు. ఈ రోజు కోడిగుడ్డు చూస్తే భయం వేసింది. తింటే వాంతులు అవుతాయని పడేశాను.
– మోషిన్‌వల్లి, ఏడోతరగతి విద్యార్థి
ఎక్కువగా ఉడకటం వల్లేనట..
కోడిగుడ్లు రంగుమారి దుర్వాసన వస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. సంస్థ నిర్వాహకులకు ఫో¯ŒS చేసి అడిగితే ఎక్కువగా ఉడకటం వల్లే అలా జరిగిందని చెప్పారు. విద్యార్థులెవరూ వాటిని తినలేక బయట పడేశారు.
– ఎన్.రమేష్, ప్రధానోపాధ్యాయుడు, జెడ్పీ ఉన్నత పాఠశాల, తణుకు
Advertisement