28న ‘ఉగాది’ జరుపుకోవడమే శాస్త్రసమ్మతం
28న ‘ఉగాది’ జరుపుకోవడమే శాస్త్రసమ్మతం
Published Tue, Mar 21 2017 10:34 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
ఉభయ గోదావరి జిల్లాల జ్యోతిష శాస్త్రవేత్తల సదస్సులో ప్రముఖులు
రాజమహేంద్రవరం కల్చరల్ : ఉగాది పండుగను ఈనెల 28న జరుపుకోవడమే శాస్త్ర సమ్మతమని పలువురు జ్యోతిష శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మంగళవారం శ్రీనివాసనగర్‌లోని శ్రీమహాలక్ష్మీసమేత చిన్న వేంకన్నస్వామి వారి పీఠం శాఖాకార్యాలయంలో జరిగిన జ్యోతిష సదస్సుకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి జ్యోతిషవేత్తలు హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామం నుంచి వచ్చిన యువజ్యోతిషవేత్త దేవులపల్లి రామకృష్ణ శర్మ మాట్లాడుతూ 28వ తేదీ ఉదయం 8.40 గంటల నుంచి 29 ఉదయం 5.46 గంటల వరకు దృక్ సిద్ధాంతం ప్రకారం పాడ్యమి తిథి ఉందని, పూర్వసిద్ధాంతం ప్రకారం 29వతేదీ ఉదయం 6.59 వరకు పాడ్యమి తిథి ఉందని తెలిపారు. అయితే ‘త్రిమూర్త వ్యాప్తి గ్రాహ్యే’ అనే ధర్మశాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి సుర్యోదయ సమయం నుంచి 144 నిమిషాలు ఆ తిథి ఉండాలన్నారు. ఈ లెక్క ప్రకారం 28వ తేదీనే పాడ్యమితిథి ఉండటం వల్ల ఉగాది పండుగను ఆనాడే జరుపుకోవడం సమంజసమన్నారు. మరో జ్యోతిషవేత్త కల్లూరి వేంకటసాయి శర్మ మాట్లాడుతూ హేమలంబి వత్సరానికి ఆదిత్యుడు అధిపతి, పాడ్యమి తిథినాడే ఆదిత్యునికి అర్చన చేయడం శ్రేయస్కరమన్నారు. పుల్లేటికుర్రు గ్రామం నుంచి వచ్చిన యువజ్యోతిషవేత్త బళ్ల దేవి మాట్లాడుతూ 2007లో ఉగాది పండుగను మార్చి 19, 20 తేదీల్లో ఎప్పుడు జరుపుకోవాలన్న విషయమై వివాదం వచ్చినప్పుడు, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక కమిటీ వేసి దానిని పరిష్కరించారని అన్నారు. పంచాంగశ్రవణం, నింభకుసుమభక్షణం, నూతన వస్త్రధారణ, పండిత సత్కారాలు పాడ్యమితిథి నాడే జరగాలన్నారు. గాయకుడు, కవి ఎర్రాప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ వివాహసమయంలో ముహూర్తమంటే తాళి కట్టే సమయమని ఒక అపోహ ఉందని, తలపై జీలకర్ర, బెల్లంపెట్టే సమయమే ముహూర్తమన్నారు. అలాగే, దేవతార్చన చేసే సమయానికి ఉన్న తిథిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు మాట్లాడుతూ శాస్త్రవిహిత కర్మలు సరైన సమయాల్లో చేస్తేనే, మనం ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. గాడాల గ్రామంలోని పీఠంలో 28వతేదీ ఉదయం పది గంటలకు పంచాంగశ్రవణం జరుగుతుందన్నారు. చర్చల ద్వారా పంచాంగకర్తలు, జ్యోతిష శాస్త్రవేత్తలు ఏకాభిప్రాయానికి రావడం అవసరమని ఆయన పేర్కొన్నారు. పలువురు జ్యోతిషశాస్త్ర అభిమానులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement