అయ్యో వైరా..! | un, happy, wyra | Sakshi
Sakshi News home page

అయ్యో వైరా..!

Published Sat, Sep 24 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

వైరా రెవెన్యూ డివిజన్‌

వైరా రెవెన్యూ డివిజన్‌

  •  వైరా రెవెన్యూ డివిజన్‌పై అస్పష్టత
  •  50 ఏళ్లుగా నిరుత్సాహం
  • చివరి నిమిషంలో మార్పులు
  •  ప్రకటించాల్సిందేనని డిమాండ్‌
  • సౌకర్యవంతమంటున్న నేతలు
  • వైరా:
        వైరా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు అనేక ఏళ్లుగా కలగానే మిగులుతోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా పరిపాలనా సౌలభ్యం కోసం వైరా రెవెన్యూ డివిజన్‌ను ముసాయిదాలో ప్రకటించారు. ఆ వెంటనే మళ్లీ కల్లూరుకు వెళ్తున్నట్లు సమాచారం రావడంతో స్థానికంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. పది మండలాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే వైరాను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని నిరసనలు వెల్లువెత్తాయి.
    - నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో వైరా నియోజకవర్గం ఆవిర్భవించింది.
    - వైరా రెవెన్యూ డివిజన్‌ను కూడా ఏర్పాటు చేస్తే పది మండలాలకు సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులంటున్నారు. ఇప్పటికే సబ్‌ డివిజన్‌ స్థాయి అధికారుల కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్న దృష్ట్యా రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌ ఊపందుకుంది.
    50 ఏళ్లుగా ఇలాగే..
    1960లో వైరా పంచాయతీ సమితిని ఏర్పాటు చేసి రెండేళ్లు మాత్రమే కొనసాగించారు. తిరిగి 1962లో రద్దు చేసి వైరా సమితిని రెండుగా చీల్చి మధిర, కల్లూరు మండలాల్లో కలిపారు. ఈ ప్రాంతం నుంచే నలుగురు ఎమ్మెల్యేలు మధిర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కనీసం మంత్రి వర్గంలో చోటు లభించకపోవడంతో వైరా అభివృద్ధిలో వెనకడుగు వేసింది.
    - వైరా రిజర్వాయర్‌ నుంచే సాగు, తాగునీరు కూడా వైరా, తల్లాడ, బోనకల్‌, మధిర, ఎర్రుపాలెం, కొణిజర్ల మండలాలకు గత 15ఏళ్లుగా సరఫరా అవుతున్నాయి. 30వేల ఎకరాల్లో పంటలు కూడా సాగవుతున్నాయి.
    - గతంలో వైరాలో షుగర్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మండలంలోని రెబ్బవరం గ్రామంలో ప్రభుత్వ భూమిని ఖరారు చేసి చివరి నిమిషంలో రాజకీయ ఒత్తిడితో కల్లూరు మండలానికి తరలించారు.
    - వైరాలో ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేస్తామని ఆనాటి ప్రభుత్వాలు ప్రకటించినా.. చివరి క్షణంలో మధిరకు తరలిపోయింది.
    - ఎన్నెస్పీ సర్కిల్‌ కార్యాలయాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాల్సి ఉన్నా అది కూడా కల్లూరుకే తరలించారు.
    ఇలా 50 ఏళ్లుగా వైరాకు ప్రతి విషయంలో నిరుత్సాహం తప్పట్లేదు.
    - మిషన్‌ భగీరథతో 11 మండలాలకు తాగునీరు
    మిషన్‌ భగీరథ పథకం ద్వారా వైరా రిజర్వాయర్‌ నుంచి జిల్లాలోని 11 మండలాలకు తాగునీటిని అందించే పనులు కూడా సాగుతున్నాయి. వైరా, కొణిజర్ల, చింతకాని, మధిర, బోనకల్‌, ఏన్కూరు, జూలూరుపాడు, తల్లాడ, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి మండలాలకు ఇక్కడి నుంచే నీరందిస్తున్నారు.
     - అన్ని కార్యాలయాలు ఇక్కడే ..
    ప్రస్తుతం వైరాలో పోలీస్‌శాఖ సబ్‌ డివిజన్‌ కార్యాలయం, ఆరు మండలాల పరిధిలో మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయం, జిల్లా మొత్తానికి సరఫరా అయ్యే ఐఎంఎల్‌ మద్యం డిపో, పశుగాణాభివృద్ధి సంస్థ జిల్లా కార్యాలయం, రైతులకు శిక్షణ ఇచ్చేందుకు కృషి విజ్ఞాన కేంద్రం, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంతో పాటు ఇటీవల అగ్ని మాపక కేంద్రం కూడా మంజూరైంది. ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఉండటం విశేషం. ఇప్పటికే రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి ఆర్డీఓ కార్యాలయం ప్రతిపాదనలను కూడా రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదించడం గమనార్హం.

    సీఎం నిర్ణయం మేరకే..
    ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం మేరకే వైరా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు ఉంటుంది. రెవెన్యూ డివిజన్‌ కేంద్రాన్ని మార్చరనే నమ్మకం ఉంది. రాజకీయ ఉద్దేశాలు ఏవీ పనిచేయవు. వైరా రెవెన్యూ డివిజన్‌ కోసం త్వరలో సీఎంను కలుస్తా. వైరా అన్ని విధాలా సౌలభ్యంగా ఉంటుంది.
     బాణోత్‌ మదన్‌లాల్‌, వైరా ఎమ్మెల్యే

    - ప్రభుత్వం ఆలోచించాలి
    వైరా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం అలోచించాలి. రాజకీయంగా, సామాజికంగా ఇక్కడి పరిస్థితులు ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్నాయి. కల్లూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు రాజకీయ దురుద్దేశమే.         - లావుడ్య రాములునాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ నాయకుడు
    - ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
    వైరా రెవెన్యూ డివిజన్‌ను ప్రకటించటం శుభపరిణామమే.. ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు తిరిగి కల్లూరు రెవెన్యూ డివిజన్‌ను తెరమీదకు తేవడం సరైంది కాదు. నిర్ణయాన్ని మార్చుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
    యర్రా బాబు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి
    - వైరా ఎంతో సౌకర్యవంతం
    వైరా రెవెన్యూ డివిజన్‌గా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఏన్కూరు, జూలూరుపాడు మండలాల నుంచి ప్రజలు వైరాకు నేరుగా ఆర్టీసీ బస్సులో చేరుకోవచ్చు. అటు ఎర్రుపాలెం, మధిర ప్రజలు కూడా బస్సులో సులభంగా రావచ్చు.
    మాలోత్‌ రాందాసునాయక్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement