చెరకు రైతుల కష్టాన్ని గుర్తించండి
Published Wed, Sep 28 2016 11:54 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
ఏలూరు (మెట్రో): చాగల్లు జైపూర్ షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం 2015–16లో రైతులకు చెల్లించాల్సిన రూ.28 కోట్ల బకాయిలను రెండు వారాల్లో చెల్లించేలా చూడాలని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావును చెరకు రైతు సంఘ సభ్యులు కోరారు. కలెక్టరేట్‌లో జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్, రైతులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో కొవ్వూరు ఆర్డీవో శ్రీనివాసరావు, జేసీ పాల్గొన్నారు. రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నా, వ్యయ ప్రయాసలు కోర్చి చెరకు పండిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఉత్తర్వులు మేరకు గతంలో కొన్ని బకాయిలను చెల్లించారని 2015–16లో బకాయిలు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించేలా రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారని జేసీ కోటేశ్వరరావు చెప్పారు. చాగల్లు జైపూర్ షుగర్స్ వైస్ ప్రెసిడెంట్ డి.భాస్కరరావు మాట్లాడుతూ వచ్చేనెలాఖరుకు పూర్తి బకాయిలు చెల్లించే ఏర్పాట్లు చేస్తామన్నారు. రైతులు రెండు వారాలు మాత్రమే గడువు ఇచ్చారని, ఈ విషయంలో తుది నిర్ణయాన్ని కలెక్టర్ కాటంనేని భాస్కర్ తీసుకుంటారని, కమిటీ ప్రతినిధులతో సంప్రదించి రైతులకు, షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి మధ్య సమన్వయం కుదిర్చే చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్యాక్టరీ ఏజీఎం జీవీ చౌదరి, డిస్టిలరీ ఫ్యాక్టరీ ఏజీఎం శివకుమార్, చెరకు రైతు కమిటీ సభ్యులు పోసిన రాజారావు, గారపాటి శ్రీనివాసరావు, వల్లభనేని శ్రీనివాసరావు, ఉండవల్లి బుచ్చయ్య, ముళ్ళపూడి కాశీ, యనమదుల రామారావు, వట్టికూటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement