పెద్ద నోట్ల రద్దుతో సాగు సంక్షోభం
మోదీ నిర్ణయంతో రైతులకు ఇబ్బందులు
వరంగల్ మహిళా కాంగ్రెస్ సమరభేరిలో ఉత్తమ్
సాక్షి, వరంగల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేయడంతో రాష్ట్రంలోని వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రబీ సీజన్‌లో ప్రతి ఏటా సుమారు 42 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే వని, నోట్ల రద్దుతో రైతులు ఆర్థికంగా ఇబ్బం దుల్లో ఉండి ఈఏడాది 20 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారని పేర్కొన్నారు. రైతులకు బ్యాంకులు రూ.11 వేల కోట్ల పంట రుణాలు ఇచ్చేవని, పెద్ద నోట్ల రద్దు సాకుతో రూ.5 వేల కోట్ల రుణాలే ఇచ్చాయని అన్నారు. రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు సాగు చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం వరంగల్‌లో సమరభేరి సభను నిర్వహించింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసం గించారు. పెద్ద నోట్ల రద్దుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నాల్కల ధోరణి అవలంభించారని ఆయన విమర్శించారు.
పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిక్కు మాలిన నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ ఆరోపిం చారన్నారు. ప్రధానమంత్రి మోదీని కలిసిన తర్వాత సీఎం కేసీఆర్ నగదు రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటనలూ చేయడంలేదని, నోట్ల రద్దుపై ప్రధానమంత్రిని పొగడడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోం దని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ లబ్ధిదారులకు అదనంగా మరో గదిని మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, శాసనమండలి లో కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ, పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.