రష్యా, పాకిస్తాన్‌లోలా అధ్యక్ష పాలనే..
మంత్రి ఉత్తమ్ ధ్వజంపదేళ్లలో పార్లమెంట్ వ్యవస్థను ధ్వంసం చేశారు
ఎన్నికల తరువాత కొత్త రేషన్ కార్డులిస్తాం
వచ్చే సీజన్ నుంచి రైతులకు రూ.500 బోనస్
రాష్ట్రంలో 11 మందితో విన్నింగ్ క్రికెట్ టీమ్‌లా ఉన్నాం
‘మీట్ ది ప్రెస్’లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పదేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్ వ్యవస్థను ధ్వంసం చేసిందని రాష్ట్ర నీటిపా రుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మరోసారి మోదీ ప్రధానైతే ఉత్తర కొరియా, రష్యా, పాకిస్తాన్‌లా దేశం తయారవుతుందని, ప్రజాస్వామ్యం స్థానంలో నియంతృత్వ పాలన వస్తుందని హెచ్చరించారు.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్లు్యజే) ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో మంత్రితో ‘మీట్ ది ప్రెస్’ జరిగింది. ఉత్తమ్ మాట్లాడుతూ పదేళ్లలో మోదీ ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని విమర్శించారు. దేశంలో ఇండియా కూటమి గెలుస్తుందనీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
దేశ రక్షణకు అగ్ని వీర్ మంచిది కాదు
అగ్నివీర్ దేశ రక్షణకు మంచిది కాదని సైన్యంలో పనిచేసిన అనుభవంతో చెపుతున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మోదీ ప్రధాని అయిన తరువాత రక్షణ విషయంలో చాలా పొరపాట్లు జరిగాయని, దేశ భూ భాగంలోకి 2000 కిలోమీటర్లు లోపలికి చైనా చొరబడిందన్నారు. ఇప్పటికే చాలామంది భారత సైనికులు బలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్ధిక వనరుల పెంపుపై కమిటీ: ఆర్థిక వనరులను పెంచడం కోసం తనతో పాటు భట్టి విక్రమార్క, శ్రీదర్ బాబు కలిసి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైందని, ఎన్నికల కోడ్ తరువాత ఆర్థిక వనరుల సమకూర్పుపై ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. రేవంత్ సీఎంగా, భట్టి ఉప ముఖ్యమంత్రిగా, ఇతర మంత్రులతో 11 మందితో పటిష్టమైన క్రికెట్ టీంగా ఉన్నామని, ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని, ఆ పార్టీలో ఎవరూ ఉండదలచుకోవడం లేదని, ఎన్నికల తరువాత ఏం జరుగుతుందో అందరు చూస్తారని వ్యాఖ్యానించారు.
వచ్చే సీజన్ నుంచి రూ.500 బోనస్
అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి ఉత్తమ్ భరోసానిచ్చారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి రైతులకు క్వింటాలు ధాన్యానికి రూ.500 బోనస్‌గా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత కొత్త రేషన్‌కార్డులు ఇచ్చే కార్య క్రమం మొదలుపెడతామని వెల్లడించారు. జర్నలిస్ట్‌లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. టీయూడ బ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ పాల్గొన్నారు.
కాళేశ్వరంలో నీరు నింపొద్దన్న ఎన్‌ఎస్‌డీఏ
కాళేశ్వరం ప్రాజెక్టులోకి ఈ వర్షాకాలంలో కూడా నీరు నింపకూడదని ఎన్‌ఎస్‌డీఏ రెండు రోజుల క్రితం ఇచ్చిన మధ్యంతర నివేదికలో స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. నీటిపారుదల శాఖను సర్వనాశనం చేసిందే కేసీఆరేనని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment