ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదర్శమైన సింగపూర్లోనూ ఆయనకు 1,900 ఎకరాల్లోనే 84 బెర్తుల పోర్టు నడుస్తోందని వడ్డే శోభనాద్రీశ్వర రావు తెలిపారు. బందరు పోర్టుకు 4,800 ఎకరాల భూమి అక్కర్లేదని.. ప్రస్తుతం కేవలం 1,800 ఎకరాల్లో మాత్రమే గంగవరం పోర్టు నడుస్తోందని ఆయన అన్నారు.
బందరుపోర్టు బాధితుల పక్షాన అఖిలపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల భూములతో వ్యాపారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్న చంద్రబాబూ... రైతుల ఉసురుపోసుకోవద్దని హితవు పలికారు. అభివృద్ధి పేరుతో అరాచకాలు తగవని చెప్పారు. బందర్‌పోర్టు బాధితుల పక్షాన అన్ని పార్టీలు కలసి ఉద్యమించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.
అవసరానికి మించి ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణను అడ్డుకోవాలని ఆయన కోరారు. రైతులపై పోలీసులను ఉసిగొల్పుతున్న దుర్మార్గ ప్రభుత్వమని ధర్మాన మండిపడ్డారు. చంద్రబాబుకు భూమి పిచ్చి పట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యద ర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబుకు రైతులంటే పడదు..ఆయనది మాట నిలబెట్టుకునే నైజం కాదని కాంగ్రెస్ శాసనమండలి సభానేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉందంటూప్రపంచం అంతా తిరుగుతున్నారని సీఎంపై ధ్వజమెత్తారు. ఎవరి భూములను హరిస్తాడో తెలియకుండా ఉంది..ఆఖరికి శ్మశానలకుకూడా స్థలం లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ కాళ్లు పట్టుకుని.. పవన్ కల్యాణ్ గడ్డం పట్టుకున్నా.. ఎన్నికల్లో బాబుకు ప్రతిపక్షం కన్నా కేవలం ఒక్కశాతం మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయని మరవొద్దని హెచ్చరించారు.