వానమ్మా.... చిన్నబోయె నేలమ్మ
- బోసిపోయిన కూడవెల్లి
- ఆందోళనలో రైతాంగం
- మరో ఇరవై రోజుల గడువుందంటున్న అధికారులు
- ఆ తరువాతే ప్రత్యామ్నాయం
‘వాగులెండి పాయెరో... పెద్ద వాగు తడి పేగు ఎండి పాయెరా...’ అంటూ ప్రజాకవి గోరెటి వెంకన్న కలం నుంచిlజాలువారిన వాగు గుండె చప్పుడు.. అక్షరాల కూడవెల్లి వాగు పేగు తడిని గుర్తుచేస్తోంది. వర్షాలు లేక కూడవెల్లి వెలవెలబోతోంది. నిండుకుండలా పారే వాగులో నీటి సవ్వడులు లేవు... దప్పిక తీర్చుకోవడానికి నీటి చెలమలు అంతకన్నా కానరావు. వాగు నీటితో తడిచే పచ్చని పైరులు కనిపించడం లేదు. ఇసుక పొరల్లో దాగి ఉన్న నీటి ఊటలూ లేవు. ఇసుకను అక్రమార్కులు తరలించుకు పోవడంతో చెలిమెల జాడ లేదు. వర్షాలు లేక అటు వ్యవసాయం చేయలేక.. ఇటు పశువులను తెగనమ్ముకోవాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడింది.
మిరుదొడ్డి:జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలం చేబర్తిలో ప్రారంభమయ్యే కూడవెల్లి వాగు గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల మీదుగా సుమారు 58 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే వాగుపై 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా అక్కడక్కడా 25 చెక్‌డ్యాంలు నిర్మించారు. పొంగిపొర్లే కూడవెల్లి వాగులోని నీరు కరీంనగర్ జిల్లా మానేరు డ్యాంలో కలిసిపోతుంది. ఎగువ కురిసిన వర్షాలతోనే కాకుండా తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లోని గొలుసుకట్టు చెరువులు నిండి పొంగి ప్రవహించిన నీటితో చిన్న చిన్న వాగుల ద్వారా కూడవెల్లి వాగులో కలిసి పోతాయి. అలా ఎప్పుడూ నిండుకుండలా కూడవెల్లి వాగు కళకళలాడేది.
పరిసర ప్రాంతాల్లోని రైతులు ఈ వాగు నీటితో మోటార్ల ద్వారా లక్షలాది హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పప్పు ధాన్యపు పంటలు, రకరకాల కూరగాయల పంటలతో సస్యశ్యామలంగా ఉండేది. దీంతో రైతులు సిరుల పంటలతో తులతూగే వారు. వర్షా కాలంలో కురిసిన నీటితో చెక్‌డ్యాంలు పొంగి ప్రవహించి కరీంనగర్ జిల్లా మానేరు డ్యాంలోకి నీరు చేరేది. చెక్‌డ్యాంలో నిలిచిన నీటి నిలువతో రైతులు నేరుగా వాగులోకి మోటార్లను దింపి పంటల సాగుకు శ్రీకారం చుట్టేవారు. వాగు పరిసరాల్లో భూ గర్భజలాలు పెరగడంతో బోర్లపై ఆధారపడ్డ రైతులు మోటార్ల సహాయంతో పంటలు పండించుకునే వారు.
చుక్క నీరు లేక..
గత రెండేళ్లు సరైన వర్షాలు లేకపోగా ఈ సారీ వర్షాలు అంతంత మాత్రమే. దీంతో చుక్క నీరు లేక కూడవెల్లి వాగు వట్టిపోయింది. అక్రమార్కులు ఇసుకను తోడి తరలించుకుపోవడంతో వాగులోని భూ గర్భజలాలు అడుగంటిపోవడంతో జీవం కోల్పోయింది. వాగు పరిసరాల్లో సాగయ్యే భూములు బీడు వారడంతో తుమ్మలు మొలిచాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు కుటుంబాలను పోషించుకునే స్థోమత లేక ఆత్మసై్థర్యాన్ని కోల్పోతున్నారు. క్షణికావేశంలో రైతులు ఉసురు తీసుకుంటున్నారు. కరువుతో అలమటిస్తున్న నేపథ్యంలో పశుగ్రాసం లేక మూగజీవాలను అమ్మేస్తున్నారు.
వాగు ఎండిపోయింది...
గత రెండేళ్ల నుంచి సరైన వర్షాలు లేక కూడవెల్లి వాగులో చుక్క నీరు లేదు. వాగు పరిసర ప్రాంతాల భూములన్నీ బీళ్లుగా మారాయి. నీరు లేక చెరువు కూడా వెలవెలబోతోంది. ఈ సారైనా వర్షాలు పడి చెరువులు, కంటలు, వాగు నిండితే పంటలు సాగు చేద్దామంటే వానలే పడుతలేవాయె.
– ఎల్లయ్య, రైతు, అక్బర్‌పేట
భూ గర్భజలాలు అడుగంటినయ్
వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటినయ్. కనీసం వర్షాధారం మీద పంటలు సాగు చేద్దామంటే చిరుజల్లులు తప్ప పెద్దగా వానలు కురిసిన దాఖలాలు లేవు. వర్షాలు కురిసి కూడవెల్లి నిండు కుండలా పొంగి పొర్లితే ఏడాదికి రెండు పంటలు తీసెటోళ్లం. కానీ వర్షాలు లేక కూడవెల్లి వాగు బోసిపోతోంది.
– రవీందర్‌రెడ్డి, రైతు, చెప్యాల
ఆశించిన వర్షాలు లేక...
ఆశించిన వర్షాలు లేక చెరువులు, కుంటలు, వాగు వంకల్లో నీరు చేరలేదు. గత ఏడాది జూలై నెలలో 238 మి.మీ. వర్షపాతానికి కేవలం 58.08 మి. మీ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ఈ ఏడాది జూలై మొదటి వారం వరకు 45.06 మి.మీ. నమోదైంది. జూలై చివరి వారం వరకు 238 మి.మీ. వర్ష పాతం నమోదైతేనే రైతాంగానికి మేలు చేకూరుతుంది. సరైన వర్షాలు పడి భూమి మొత్తం తడిస్తేనే విత్తనాలు చల్లుకోవాలి. ఖరీఫ్ సీజన్ మరో 20 రోజులు ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఒక వేళ సరైన వర్షాలు లేకపోతే ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలతో రైతులు ఖరీప్ సీజన్ నుండి గట్టెక్కవచ్చు.
– ఎస్.నాగరాజు, ఏఓ, మిరుదొడ్డి