జగదేవ్‌పూర్‌లో రోడ్డు ప్రక్కన సీతాఫలాలు అమ్ముతున్నా కూలీలు
జగదేవ్‌పూర్: తెల్లవారంగానే చంకన తట్టబుట్ట, సంచి పట్టుకుని అడవికి ప్రయాణం..చెట్టు పుట్ట తిరుగుతూ సీతాఫలాల కోసం ఆరాటం..సేకరించిన కాయలను తట్టలో పెట్టుకుని అమ్మేందుకు పోటీ..ఇదంతా కూలీల బతుకు పోరాటం..వాన కాలం చివరి దశలో ఏ పల్లెలో చూసినా సీతాఫలాల కోసం కూలీలు ఊరు విడిచి వెళుతూ కనిపిస్తారు. మండలంలోని సీతాఫలాల అమ్మకాలు జోరందుకున్నాయి. వందలాది మంది కూలీలు సీతాఫలాలతో ఉపాధి పొందుతున్నారు.
జగదేవ్‌పూర్ మండలం అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో ప్రతి ఏటా సీతాఫలాలతో ఎంతో మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. మండలంలోని ధర్మారం, కొండాపూర్, పీర్లపల్లి, దౌలాపూర్ తదితర గ్రామాల్లో వందలాది ఎకరాలు అటవీ ప్రాంతం ఉంది. జిల్లా సరిహద్దు మండలం కావడంతో నల్గొండ, వరంగల్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో అటవీప్రాంతం ఉంది. గంధమల్ల, నర్సాపూర్, సాల్వపూర్, సింగారం తదితర గ్రామాల్లో కూలీలు సీతాఫలాలను సేకరిస్తారు.
సేకరించిన కాయలను తట్ట చొప్పున విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఒక్క తట్ట వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అమ్ముతున్నారు. సేకరించిన సీతాఫలాలను ప్రధాన రోడ్ల వెంట విక్రయిస్తున్నారు. జగదేవ్‌పూర్, పీర్లపల్లి ప్రధాన రోడ్ల వెంట ఎంతో మంది కూలీలు సీతాఫలాలతో కనిపిస్తారు.
ముఖ్యంగా ముదిరాజ్ కులస్తులు ఎక్కువగా సీతాఫలాలతో ఉపాధి పొందుతున్నారు. ప్రతి రోజు ఒక్కో కూలీ సుమారు రెండు వందల నుంచి ఐదు వందల వరకు సంపాదిస్తున్నారు. సేకరించిన సీతాఫలాలను హైదరాబాద్ నుంచి వచ్చి కూలీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మండలం నుండి ప్రతిరోజు ఐదు నుంచి ఎనిమిది ఆటో వరకు తరలిపోతున్నాయి.
భలే గీరాకి
సీతాఫలాలలో ఔషధ గుణాలు ఎక్కువ ఉండడంతో సీజన్‌లో సీతాఫలాలకు గిరాకీ పెరిగింది. గత ఏడాది కంటే ఈ సారి వ్యాపారం జోరందుకుంది. కాలం కలిసిరావడమే కాకుండా చెట్లకు ఎక్కువ శాతం కాయలు కాయడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా ఒక్క చెట్టుకు వందకు పైగా కాయలు కాశాయి.
గ్రామాల్లో ఉదయమే అటవీప్రాంతానికి వెళ్లి సాయంత్రం అమ్ముకుని ఇంటి దారి పడుతున్నాయి. సీతాఫలాలలో ఔషధ గుణాలు ఉండడంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పిల్లలను సెలవు ఉండడంతో తల్లిదండ్రులతో కలిసి సీతాఫలాల సేకరణకు వెళుతున్నారు.
రోజుకు వంద పైగా సంపాదిస్తున్నా : కూలీ, మల్లమ్మ
సీతాఫల కాయలతో రోజుకు వందకు పైగానే సంపాదిస్తున్నా. మా ఊరి నుంచి చట్టు ముట్టు గ్రామాల్లో ఉన్న అడవులోకి వెళ్లి రోజుకు రెండుమూడు తట్టల కాయలను తెంపుకుని వస్తున్నా. ఓ రోజు ధర బాగానే ఉంటుంది. ఓ రోజు తక్కువ ధర వస్తుంది. అయినా గత పది రోజలు నుంచి అమ్ముతున్నా. మంచి డిమాండ్ ఉంది. ఎంతో మంది వచ్చి తట్టలకొద్ది కొంటున్నారు.
సీతాఫలాలతో ఉపాధి పొందుతున్నా..కూలీ, లక్ష్మి
కూలీ పనులు దొరకడం చాలా కష్టంగా మారింది. దీంతో సీతాఫలాలతో ఉపాధి పొందుతున్నా. ప్రతిరోజు రెండు వందల వరకు లాభం వస్తుంది. తిరిగితే కానీ కాయలు దొరకడం లేదు. గతంలో కంటే ఈ సారి చాలా మంది కూలీలు సీతాఫలాల కోసం అడవులు తిరుగుతున్నారు. ఒక్క తట్టకు వంద నుండి రెండు వందల వరకు అమ్ముతున్నా.