వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ
మందకృష్ణ చంద్రబాబుకు తొత్తు: వంగపల్లి
Published Sat, Sep 17 2016 11:14 PM | Last Updated on Tue, Oct 9 2018 5:22 PM
ఉస్మానియా యూనివర్సిటీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన, మాదిగ జాతి అభ్యున్నతి కోసమే మలిదశ పోరాటాన్ని చేపట్టామని ఎమ్మార్పీఎస్–టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ అన్నారు. శనివారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో “సాక్షి’తో మాట్లాడారు. 2019 నాటికి వర్గీకరణ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఎంఎస్‌పీ స్థాపించిన తరువాత ఎమ్మార్పీఎస్‌తో సంబంధం లేదని ప్రకటించిన మందకృష్ణ మాదిగ అది ఫలించక పోవడంతో వర్గీకరణ పేరుతో జాతిని మరోమారు మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును పెట్టించి ఆమోదింపచేసిన ఘనత తమదేనని. చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్న మందకృష్ణ ఏపీ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును పెట్టించలేకపోయారన్నారు.
20 ఏళ్లుగా చేసిందేమీ లేదు
వర్గీకరణ పేరుతో మందకృష్ణమాదిగ తన 20 ఏళ్ల ఉద్యమంలో సాధించిందేమీ లేదన్నారు. ఇటీవల తాము ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి వర్గీకరణపై ఒత్తిడి తెచ్చామన్నారు. మందకృష ఉద్యమంలో చిత్తశుద్ధిలేదని, వర్థనపేట నియోజక వర్గంలో మందకృష్ణకు డిపాజిట్ దక్కలేదన్నారు. మోకరిల్లడం ఉద్యమకారుడి లక్షణం కాదని, వెంకయ్య నాయుడుని అంబేద్కర్‌తో పోలుస్తూ కాళ్లు మొక్కి జాతిని తాకట్టు పెట్టారన్నారు. మలిదశ దండోర ఉద్యమంలో మాదిగలను మద్యానికి దూరం చేసి, విద్య, అభివృద్ధికి చేరువచేయాలనే లక్ష్యంతో ఎమ్మార్పీఎస్–టీఎస్ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
నేటినుంచి చైతన్య యాత్ర
డప్పు, చెప్పుకు నెలకు రూ.2 వేల పింఛన్, వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం కేంద్రం పై వత్తిడి పెంచేందుకు ఈ నెల 18 నుంచి 60 రోజుల పాటు మాదిగ చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా కొలనుపాక నుంచి ప్రారంభమయ్యే యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందన్నారు. నవంబరు 19న హైదరాబాద్‌లో మాదిగల జన జాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
Advertisement