వంతుల తంతు
వంతుల తంతు
Published Fri, Jan 20 2017 11:52 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM
కొవ్వూరు : ఈ ఏడాది రబీలో రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. వరి నాట్ల దశలోనే చేలకు నీరందని దుస్థితి దాపురించింది. శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడి చేలల్లోకి నీరు పారకపోవడంతో నాట్లు ముందుకు సాగటం లేదు. మరోవైపు గోదావరి నదిలో సహజ జలాల లభ్యత క్రమంగా పడిపోతోంది. ఈ పరిస్థితి వల్ల నదిలోని ఇసుక మేటలు పైకి తేలుతున్నాయి. ఫలితంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు విడుదల చేసే నీటి పరిమాణాన్ని కుదించారు. జనవరి మొదటి వారంలోనే నూరు శాతం నాట్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. నీరందక నెమ్మదించాయి. కొన్నిచోట్ల ఉడ్చిన పంటకు నీళ్లందక మోటార్ల సాయంతో తోడుకుంటున్నారు. ఈ నెల ఆరంభంలో 6 వేల క్యూసెక్కులున్న సహజ జలాల లభ్యత 4,200–4,500 క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో సంక్రాంతి రోజుల్లో 90 డ్యూటీ (ఒక క్యూసెక్కు 90 ఎకరాలకు)గా సరఫరా చేసిన నీటిని గురువారం నుంచి 120 డ్యూటీకి పెంచారు. మూడు రోజుల క్రితం మూడు డెల్టాలకు 9,900 క్యూసెక్కులు ఇవ్వగా.. ఇప్పుడు 7,460 క్యూసెక్కులకు తగ్గించారు.
తీవ్రం కానున్న కష్టాలు
రానున్న రోజుల్లో సాగునీటి కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. దీంతో పంటల్ని గట్టెక్కించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేస్తున్నారు. డెల్టాకు ఆదివారం నుంచి వంతులవారీ విధానంలో సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రెండు డెల్టాలకు గురువారం నుంచి వంతులవారీ విధానం అమలు చేస్తున్నారు. జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగువుతుండగా, 1,500 ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
అందుబాటులో ఉండేది 69 టీఎంసీలే
ఈ ఏడాది నీటి లభ్యతను లెక్కించి గోదావరిలో డిసెంబర్ 1 నుంచి మార్చి నెలాఖరు వరకు 33 టీఎంసీల మేర సహజ జలాలు అందుబాటులో ఉంటాయని అంచనా వేశారు. రబీకి 75 నుంచి 80 టీఎంసీల నీరు అవసరం. అయితే, 69 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంటాయని జల వనరుల శాఖ చెబుతోంది. నాట్లు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఏప్రిల్ 20వ తేదీ వరకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. ఆలస్యంగా వేసిన పంటకు ఏప్రిల్ నెలలో అందుబాటులోకి వచ్చే సీలేరు, సహజ జలాలతో సరిపెట్టే యోచనలో అధికారులు ఉన్నారు. మొత్తంగా 8 నుంచి 10 టీఎంసీల కొరత ఉంటుందని అంచనా. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా పంటలకు నీరు అధికంగా అవసరం అవుతుంది. పంట చివరి దశలో ఎండలు తీవ్రంగా ఉంటే వంతులవారీ విధానంలోనూ నీటిఎద్దడి తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పొదుపు చర్యలు పాటించడంతోపాటు నీటివృథాను పూర్తిగా ఆరికట్టకపోతే చివరి దశలో నీటి కటకట తప్పదు. సీలేరు జలాలపైనే అ«ధికారులు ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
అడ్డుకట్టలే శరణ్యం
నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా వృథా నీటిని చేలకు మళ్లించేందుకు జల వనరుల శాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొం దించారు. 187 చోట్ల అడ్డుకట్టలు వేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.1.50 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. దీంతోపాటు 62 చోట్ల ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసేందుకు రూ.3 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. వంతులవారీ విధానాన్ని సమగ్రంగా అమలు చేసేందుకు కాలువ పర్యవేక్షణ నిమిత్తం జిల్లాలో 100 మంది లస్కర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. వీరు నాలుగు నెలలు పాటు సేవలందిస్తారు.
శివారు ప్రాంతాల్లో మొదలైన కష్టాలు
శివారు ప్రాంతాల్లో అప్పుడే సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నీటిఎద్దడి కారణంగా శివారు ఆయకట్టులో కొన్నిచోట్ల ఇంకా నాట్లు పూర్తికాలేదు. యలమంచిలి మండలంలో 8,290 ఎకరాల్లో నాట్లు వేయాల్సి ఉండగా, 6,180 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఆచంట నియోజకవర్గ పరిధిలో సుమారు 2 వేల ఎకరాల్లో నాట్లు వేయాల్సి ఉంది. పెనుగొండ, ములపర్రు, రామన్నపాలెం, జుత్తిగ, మల్లిపూడి, ఎ.వేమవరం, భీమలాపురం తదితర ప్రాంతాల్లో నాట్లు పూర్తి కాలేదు. పాలకొల్లు మండలం దిగమర్రు కాలువ పరిధిలోను, గోరింటాడ, కొత్తపేట, పెదమామిడిపల్లి, ఆగర్రు, సగంచెరువు తదితర ప్రాంతాల్లో సుమారు 1,000 ఎకరాల్లో నాట్లు వేయలేదు. మొగల్తూరు మండలంలో శివారు ప్రాంతంలో సుమారు 200 ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉంది. నరసాపురం మండలం సరిపల్లి, కొప్పర్రు ప్రాంతాల్లో దమ్ములు చేసుకునేందుకు నీరు అందడం లేదు. భీమవరం, పోడూరు, ఆచంట, పెనుమంట్ర, వీరవాసరం, పాలకోడేరు మండలాల్లో పలుచోట్ల నాట్లు పూర్తి చేయాల్సి ఉంది.
వంతులవారీ షెడ్యూల్ ఇలా
ఏలూరు (మెట్రో) : వంతులవారీ విధానంపై జల వనరుల శాఖ అధికారులతో కలెక్టర్ కాటంనేని భాస్కర్ చర్చించారు. ఈనెల 22 నుంచి ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం వంతుల వారీ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈనెల 22వ తేదీ ఉదయం 6నుంచి 27వ తేదీ ఉదయం 6 గంటల వరకు మొదటి వంతు, 27 సాయంత్రం 6 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రెండో వంతుగా నీరు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 2న ఉదయం 6నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మొదటి వంతు, 7న సాయంత్రం 6నుంచి 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ రెండో వంతు కొనసాగుతుంది. ఫిబ్రవరి 13 ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మొదటి వంతు, 18 సాయంత్రం 6నుంచి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ రెండో వంతు, 24న ఉదయం 6నుంచి మార్చి 1వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మొదటి వంతు, 1వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి 6వ తేదీ సాయంత్రం 6గంటల వరకూ రెండో వంతు, 7వ తేదీ ఉదయం 6నుంచి 12వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మొదటి వంతు, 12వ తేదీ సాయంత్రం 6 నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ రెండోవంతు నీరిస్తారు. మార్చి 18వ తేదీ ఉదయం 6 నుంచి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మొదటి వంతు, 23వ తేదీ సాయంత్రం 6నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ రెండో వంతు నీటి సరఫరా చేస్తారు.
22నుంచి వంతుల వారీ
పశ్చిమ డెల్టా ఆయకట్టులో ఈనెల 22వ తేదీ నుంచి వంతుల వారీ విధానంలో సాగునీరు అందించాలని నిర్ణయించాం. నీటి పొదుపు చర్యలు పాటించడంతోపాటు నీటివృథాను ఆరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కోసం లస్కర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకున్నాం. నీటి పొదుపు విషయంలో రైతులు, నీటి యాజమాన్య సంఘాలు సహకరించాలి.
– కె.శ్రీనివాసరావు, ఎస్‌ఈ, నీటి పారుదల శాఖ
Advertisement
Advertisement