వైఎస్ జగన్ దీక్షకు సంఘీభావం
- ప్రత్యేక హోదా కోసం రేపటి నుంచి జననేత నిరవధిక నిరాహారదీక్ష
- గుంటూరులోని నల్లపాడులో దీక్షా శిబిరం ఏర్పాట్లు పూర్తి
- ప్రత్యేక హోదా ఆవశ్యకతపై వైఎస్సార్ సీపీ శ్రేణుల విస్తృత ప్రచారం
- గుంటూరులో రౌండ్‌టేబుల్ సమావేశం
- పాల్గొన్న విద్యార్థి, యువజన, సేవా సంఘాల నేతలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న నిరవధిక నిరాహారదీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి (అక్టోబర్ 7) గుంటూరులోని నల్లపాడులో జరగనున్న దీక్షలో పాల్గొని వైఎస్ జగన్ కు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, కార్యకర్తలు గుంటూరుకు పయనమవుతున్నారు.
వైఎస్ జగన్.. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నల్లపాడులోని దీక్షా శిబిరానికి బయలుదేరుతారు.
మొదట గత నెల 26 నుంచి గుంటూరులో చేపట్టాలని భావించిన దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం ఆటంకం కలిగించినప్పటికీ కార్యకర్తలు, నాయకులు రెట్టించిన ఉత్సాహంతో దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, సీనియర్‌నేత బొత్ససత్యనారాయణ ప్రత్యక్షంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండల, గ్రామస్థాయి నాయకులు ప్రత్యేక హోదాపై విస్త్రత ప్రచారం చేస్తున్నారు. దీక్ష విజయానికి కార్యకర్తలు ప్రజలను సమాయత్తం చేస్తున్నారు.
దీక్షకు మద్దతు..
సోమవారం గుంటూరు పట్టణంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి విజయసాయిరెడ్డి, మాజీ కేంద్రమంత్రి, ఎమ్మెల్సీ ఉమ్మారె డ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప్పులేటి కల్పన, జిల్లా, నగర అధ్యక్షులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలు విద్యార్థి, యువజన, సేవాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని జగన్ చేపట్టనున్న దీక్షకు సంఘీభావం పలికారు.
ఓటుకు కోట్లు కేసుల్లో ఇరుక్కున చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజిపై కేంద్రంపై వత్తిడి తీసుకురావడం లేదని, స్వప్రయోజనాల కోసం ప్రజల శ్రేయస్సును తాకట్టుపెడుతున్నారని వారంతా దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్షకు మద్దతుగా నిలుస్తామని ప్రతినబూనారు.