వికసించిన వీరస్వామి
-
పల్లెటూరు విద్యార్థికి విదేశంలో డాక్టరేట్
-
ఉన్నత చదువుకు అడ్డురాని పేదరికం
-
తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన రామచంద్రాపురం వాసి
రామచంద్రాపురం (దేవరుప్పుల) : అంకితభావం, క్రమశిక్షణతో చదువుకుంటే విజయతీరాలను సులువుగా చేరుకోవచ్చని నిరూపించాడు ఓ విద్యార్థి. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ పట్టుదలతో విద్యనభ్యసించి పొరుగు దేశంలో డాక్టరేట్ పొంది తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు.
వివరాల్లోకి వెళితే.. మండలంలోని కోలుకొండ శివారు రామచంద్రాపురంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన గాజులపాటి రామయ్య, సత్తెమ్మ దంపతుల రెండో కుమారుడు వీరస్వామి చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. ఈ మేరకు స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి, దేవరుప్పుల హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివిన ఆయన హైదరాబాద్‌లోని భాగ్యనగర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ, నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివాడు. అయితే అప్పటికే తన అన్నయ్య కొండాజీ.. కొరియా దేశంలో ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఓ ల్యాబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో అతడిని స్ఫూర్తిగా తీసుకున్న వీరస్వామి కొరియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్స్ అండ్ బయో టెక్నాలజీ సౌత్ కొరియాలో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవడంతో సీటు లభిం చింది. ఈ క్రమంలో ఆయన ‘సింథటిక్ అండ్ బయోలజీ ఆక్టివిట్ ఆఫ్ నోవల్ న్యూక్లోయోసీడ్స్ ఆజ్ ప్రొటెన్షియల్ యాంటీ స్కేమిక్ అండ్ యాంటీ వైరల్ ఏజెంట్’ అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి కొరియా యూనివర్సిటీ ఇటీవల డాక్టరేట్ ప్రకటించింది. కాగా, ప్రొఫెసర్ యేంగ్‌కోసీకో చోయ్ పర్యవేక్షణలో వీరస్వామి పరి శోధనను పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందాడు. మారుమూల పల్లెలో ప్రాథమిక విద్యనభ్యసించి విదేశాల్లో డాక్టరేట్ పొందడంపై కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.