వాహనాల దొంగ అరెస్టు
Published Fri, Jan 13 2017 12:38 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
- అదుపులోకి తీసుకున్న కోవెలకుంట్ల పోలీసులు
- టిప్పర్, ఐదు బైకులు స్వాధీనం
కర్నూలు :
వాహనాలను చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న అంతర్‌జిల్లా దొంగను కోవెలకుంట్ల పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఒక టిప్పర్, ఐదు బైకులు స్వాధీనం చేసుకునిఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డితో కలసి ఎస్పీ గురువారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరులకు వెల్లడించారు. కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె దగ్గర కదిరి సోమశేఖర్‌రెడ్డికి చెందిన టిప్పర్ చోరీకి గురైంది. దొంగల కోసం సీఐ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో గాలింపు చేపట్టిన పోలీసులు ప్యాపిలి మండలం గార్లదిన్నెకు చెందిన పవన్‌కుమార్ నంద్యాల మండలం అయ్యలూరిమెట్ట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు సోమశేఖర్‌రెడ్డికి చెందిన టిప్పర్‌ను చోరీ చేసినట్లు అంగీకరించాడు. అలాగే అనంతపురంలో ఐదు బైక్‌లను కూడా దొంగిలించినట్లు తెలిపాడు. ఇతడు గతంలో ప్యాపిలి, బనగానపల్లె పోలీస్‌స్టేషన్ల పరిధిలో లారీలు దొంగతనం చేసి జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి తిరిగి వచ్చి మళ్లీ నేరాల బాట పట్టాడు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు రూ.11.30 లక్షలుంటుందని ఎస్పీ వెల్లడించారు. దొంగ ఆచూకీ కనిపెట్టి వాహనాలను రికవరీ చేసినందుకు సీఐ శ్రీనివాసరెడ్డి, కొలిమిగుండ్ల ఎస్‌ఐ బి.టి.వెంకటసుబ్బయ్యతో పాటు క్రైం పార్టీ కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు.
అత్యాచారం కేసులో నిందితుడు అరెస్టు...
మద్దికెర మండలం కొత్తపల్లెకు చెందిన మతిస్థిమితం లేని యువతిపై ఈనెల 8వ తేదీన అత్యాచారం జరిపిన ముడావత్ సుంకే నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డోన్‌లోని బంధువుల ఇంట్లో తల దాచుకోవడానికి వెళ్తున్నట్లు కచ్చితమైన సమాచారం అందడంతో పత్తికొండ సీఐ విక్రమసింహ, ఎస్‌ఐ మధుసూదన్‌రావు, మద్దికెర ఎస్‌ఐ అబ్దుల్ జహీర్ తదితరులు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గుండాలతండాకు చెందిన ఇతన్ని జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌తో కలసి ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వ్యాస్ ఆడిటోరియంలో విలేకరులకు వెల్లడించారు. కొత్తపల్లి గ్రామ సమీపంలో మతిస్థిమితం లేని మహిళ గేదెలు మేపుతూ ఒంటరిగా ఉండగా ముడావత్ సుంకే నాయక్ ఆమెను సమీపించి బలాత్కారం చేయగా ఆమె ప్రతిఘటించింది. ఆమెను గాయపరచి అత్యాచారం చేసి పారిపోయాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు వైద్యచికిత్సలు చేయించారు. తక్కువ వ్యవధిలోనే నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినందుకు ఎస్‌ఐ, సీఐలను ఎస్పీ అభినందించారు.
Advertisement