'కాల్మనీపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలి'
‘కాల్‌మనీ’పై కేంద్ర మంత్రి వెంకయ్య
సాక్షి, విజయవాడ: కాల్‌మనీపై అసెంబ్లీలో విస్తృత చర్చ జరగాలని, దోషులు ఏ పార్టీలో ఉన్నా కఠినంగా శిక్షించాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒకరిపై ఒకరు ఆరోపణలు మాని దోషులను గుర్తించేందుకు ప్రయత్నించాలని సూచించారు. దోషులకు రాజ కీయ రంగు పులమడం వల్ల వారు తప్పించుకునే అవకాశముందన్నారు. కేసు మూలాల్లోకి వెళ్లి దోషులను గుర్తించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు. ‘హెరాల్డ్’ను పక్కదోవ పట్టించేందుకే..
పార్లమెంట్ సజావుగా సాగేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సహకరించాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు. జీఎస్‌టీ, రియల్‌ఎస్టేట్, ఇన్‌లాండ్ వాటర్ వేస్ట్ వంటి 16 ముఖ్యమైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసును సోనియా, రాహుల్‌గాంధీ పక్కదోవ పట్టించేందుకు బీజేపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తమ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. 2012లో హెరాల్డ్ కేసును సుబ్రహ్మణ్యస్వామి కోర్టులో వేశారని, అప్పుడు ఆయన బీజేపీ సభ్యుడు కాదన్నారు.
హిందూత్వం భారతీయ వారసత్వం: వెంకయ్య
గుంటూరు ఎడ్యుకేషన్: హిందూత్వం అంటే మతం కాదు.. అనాదిగా వస్తున్న భారతీయ వారసత్వమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గుంటూరులో జరుగుతున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 33వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా శనివారం ఏబీవీపీ పూర్వ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఒకప్పటి ఏబీవీపీ కార్యకర్తలు, ప్రస్తుత కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, జగత్ ప్రకాష్ నడ్డా ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి కామినేని, ఏబీవీపీ నాయకులు సునీల్ అంబేకర్, మురళీమనోహర్, తిరుమలరెడ్డి, పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.