మహబూబ్‌నగర్ క్రైం : ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అటూ రాష్ట్రంలో, ఇటూ జిల్లాలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) విజయకేతనం ఎగురవేసింది. జిల్లాలో ఉన్న 9 డిపోలలో టీఎంయూ జెండా ఎగురవేసి క్లీన్‌స్వీప్ చేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చరిత్ర సృష్టించింది. మంగళవారం జిల్లాలో జరిగిన ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరిగింది. రాత్రి 6.30నుంచి కౌటింగ్ ప్రారంభం చేసిన అధికారులు 9గంటలకు ఫలితాలు వెల్లడించారు. దీం ట్లో అన్నింటిని టీఎంయూ సొంతం చేసుకుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా టీఎంయూ నాయకులు డిపోల ఎదుట సంబరాలు జరుపుకున్నారు.
జిల్లాలో 9డిపోలను టీఎంయూ సొంతం చేసుకున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి మహబూబ్‌నగర్ డిపోలో సంబరాలు జరుపుకున్నారు. డిపోలనుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అక్కడి నుంచి తెలంగాణ చౌరస్తా మీదగా వెళ్లి న్యూటౌన్ నుంచి మళ్లీ బస్టాండ్‌కు చేరుకున్నారు. కార్యక్రమంలో టీఎంయూ నాయకులు రాజసింహుడు, జీఎల్ గౌడు, రవీందర్‌రెడ్డి, బస్సప్ప, డీఎస్‌చారి, భానుప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
∙ జిల్లాలో మొత్తం 9డిపోల పరిధిలో టీఎంయూకు 2641ఓట్లు రాగా, ఈయూకు 365, ఎన్‌ఎంయూకు 857ఓట్లు వచ్చాయి. ఈ మూడు సంఘాల్లో టీఎంయూ గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధికమైన ఓట్లు సొంతం చేసుకుంది.
∙ జిల్లాలో గద్వాల డిపోలో ఎప్పుడు కూడా ఈయూ గెలుపొందేది. కానీ మొదటి సారిగా గద్వాల కోటపై టీ ఎంయూ జయకేతనం ఎగురవేసింది. గద్వాలపై ఎంతో పట్టు ఉన్న ఈయూ ఈ ఎన్నికల్లో కేవలం 32ఓట్లు సొంతం చేసుకోవడం విశేషం.
∙ మహబూబ్‌నగర్ డిపోలో మొత్తం 606 ఓట్లు ఉంటే దీంట్లో 461టీఎంయూ, ఈయూ 36, ఎన్‌ఎంయూ 72ఓట్లు సొంతం చేసుకున్నారు.
∙ అచ్చంపేటలో డిపోలో 375ఓట్లు ఉంటే వాటిలో టీఎంయూ 250, ఈయూ 114, ఎన్‌ఎంయూ2 ఓట్లు సాధించాయి.
∙ గద్వాల డిపో పరిధిలో 526ఓట్లు ఉంటే ..టీఎంయూ 293, ఈయూ 32, ఎన్‌ఎంయూ87 ఓట్లు సొంతం చేసుకున్నాయి
∙ కల్వకుర్తి డిపో పరిధిలో 489ఓట్లకు గాను 380ఓట్లు టీఎంయూకు, ఈయూకు 45, ఎన్‌ఎంయూకు 40ఓట్లు వచ్చాయి.
∙ కొల్లాపూర్ డిపో పరిధిలో 276ఓట్లు ఉంటే ..టీఎంయూకు 169, ఈయూకు 28, ఎన్‌ఎంయూకు 73 ఓట్లు పడ్డాయి.
∙ నాగర్‌కర్నూల్ డిపోలో 336ఓట్లు ఉంటే వాటిలో 169ఓట్లు టీఎంయూకు, ఈయూకు 29, ఎన్‌ఎంయూకు 132ఓట్లు వచ్చాయి.
∙ నారాణపేట ఆర్టీసీ డిపో పరిధిలో 449ఓట్లకు గాను ..టీఎంయూకు 303ఓట్లు రాగా, ఈయూకు 0, ఎన్‌ఎంయూకు 127ఓట్లు వచ్చాయి.
∙ షాద్‌నగర్ డిపో పరిధిలో మొత్తం 496ఓట్లు ఉంటే వాటిలో టీఎంయూకు 311ఓట్లు పోలయ్యాయి. ఈయూకు 40, ఎన్‌ఎంయూకు 136ఓట్లు రావడం విశేషం.
∙ వనపర్తి డిపో పరిధిలో మొత్తం 540ఓట్లు ఉంటే వాటిలో టీఎంయూ 305ఓట్లు సొంతం చేసుకుంటే ఈయూకు41, ఎన్‌ఎంయూకు 188 వచ్చాయి.
∙ మహబూబ్‌నగర్ ఆర్‌ఎం కార్యాలయంలో 40ఓట్లు ఉంటే వాటిలో 39ఓట్లు టీఎంయూ కైవసం చేసుకుంది.