- - రైతు ప్రయోజనాల పాతర
- - లిఫ్ట్ ఇరిగేషన్ పైపులైన్ పనుల కోసం చెరకు తోటలు «ధ్వంసం
- - కాలువ తవ్వకం మట్టితో చెరకు తోటలకు నష్టం
- - మామిడాడలో రైతులు గోడు పట్టించుకోని కాంట్రాక్టు సంస్థ
- - నేటికీ దక్కని పరిహారం
విధ్వంసం
Published Fri, May 12 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM
జగ్గంపేట :
ఎత్తిపోతల పథకాలు పేరిట రూ.కోట్లు ధనాన్ని లూటీ చేస్తున్న టీడీపీ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులను బలితీసుకుంటోంది. అఖండ గోదావరి నుంచి ఏలేరు ఆయకట్టుకు నీటిని అందించే వంకతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి బీజం వేసి పర్సంటేజీ ల హడావుడిలో రైతులకు రావల్సిన పరిహారం విషయాన్ని పట్టించుకోవడం లేదు. గోదావరి జలాలను సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి పంపింగ్ చేసుందుకు రూ.1,638 కోట్లతో ప్రణాళిక వేశారు. పురుషోత్తపట్నం స్టేజ్-1, రామవరం నుంచి ఏలేరుకి నీటిని తరలించేందుకు స్టేజ్-2గా పనులు విభజించారు. ఈ పథకం కోసం భూములను రైతుల నుంచి బలవంతంగా సేకరించగా సీతానగరం మండలంలో నిరసనలు వ్యక్తం కావడంతో పరిహారం పెంచి బుజ్జగించారు. గోదావరి నుంచి 3,500 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్‌ంగ్ చేసి పోలవరం కాలువలో విడిచిపెట్టి, అక్కడ నుంచి 58 కిలోమీటర్లు ఉన్న రామవరం వద్ద స్టేజ్-2లో నిర్మించే పంప్‌హౌస్ ద్వారా 1,400 క్యూసెక్కుల నీటిని ఏలేరు రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేసేందుకు ప్రతిపాదించారు. రామవరం వద్ద పంప్‌హౌప్ పనులు చేపడుతున్నారు. రామవరం నుంచి ఏలేరు ప్రాజెక్టు వరకు సుమారు 13.12 కిలోమీటర్ల మేర పైపులైను నిర్మించాల్సి ఉంది.
.
పరిహారం చెల్లించకుండానే తవ్వకాలు
జగ్గంపేట మండలంలో రామవరం, మర్రిపాక, గొల్లలగుంట, ఇర్రిపాక, మామిడాడ గ్రామాలతోపాటు ఏలేశ్వరం మండలంలో అప్పనపాలెం మీదుగా పైపులైన్ రెండు వరసల్లో వేయాల్సి ఉంది. ఇక్కడ సేకరించిన భూములకు పరిహారం నిర్థారించకుండానే పనులు చేపట్టడంతో రామవరంలో రైతులు ఆందోళనలు చేశారు. పైపులైన్ కోసం మండలంలోని సుమారు వంద ఎకరాలు సేకరించగా వీటిలో ప్రభుత్వ భూమి మినహయిస్తే సుమారు 95 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. జాతీయ రహదారిని ఆనుకుని రామవరం గ్రామం ఉండడంతో ఎకరాకు సుమారు రూ.26 లక్షలు, మిగిలిన గ్రామాలకు రూ.22.5 లక్షల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు రైతులకు పరిహారం ఇవ్వవల్సి ఉండగా నేటికీ ఆ ఊసే ఎత్తడం లేదు. మరో వైపు పైప్‌లైన్ పనులు మాత్రం ముమ్మరంగా చేపడుతున్నారు.
.
తీవ్ర నష్టం...
రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు కాంట్రాక్టు పొందిన మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిడెడ్ సంస్థ తన ఇష్టానుసారం ముందుకు సాగడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పరిహారం అందక ఆందోళనలో ఉన్న రైతులకు పైపులైన్ పనులు మింగుడు పడడం లేదు. సేకరించిన భూమిని దాటిపోయి పైపు లైన్‌కోసం తవ్వే మట్టిని వేస్తున్నారు. దీంతో పంటను రైతులు నష్టపోతున్నారు.
+ మండలంలోని రామవరం గ్రామంలో ఒక రైతుకు చెందిన పామాయిల్ తోటలో చెట్లను నరికివేయగా రాజకీయ పెద్దల జోక్యంతో అడ్డుకట్టపడింది.
+ రెండు రోజుల కిందట మండలంలోని మమాడాడ గ్రామంలో మిరియాల లోవరాజుకు చెందిన పొలంలో పైపులైన్ పనులు చేపడుతూ మట్టిన సేకరించి స్థలానికి అవతల వేయడంతో కౌలు చేసుకుంటున్న పెంటకోట సత్తిబాబు సుమారు ఏడు టన్నుల చెరకు పంటను నష్టపోవల్సి వచ్చింది. దీంతో వారు కాంట్రాక్టు సంస్థ సిబ్బందిని పనులు నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. రైతుల ప్రయోజలను దెబ్బతీసేలా పనుల చేపట్టడం దారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్ శివమ్మను వివరణ కోరగా రైతులకు పరిహారం జూన్‌లో వస్తుందన్నారు. పంటలపై మట్టి వేయకూడదని దీనిపై రైతులకు నష్టం లేకుండా పనులు జరిగేలా కాంట్రాక్టు సంస్థకు సూచనలు ఇస్తామన్నారు.
.
పరిహారం ఇవ్వలేదు ...
పురుషోత్తపట్నం పైపులైన్ కోసం భూమిని తీసుకున్నారు. నాకు 96 సెంట్లు మాత్రమే ఉంది. సుమారు 20 సెంట్లు పైపులైన్‌కు కోల్పోయాను. పరిహారం ఇవ్వలేదు. పంటలను ధ్వంసం చేయడం సమంజసం కాదు.
– మిరియాల లోవరాజు, రైతు – మామిడాడ.
కౌలు భూమిలో చెరకు పంటను మట్టితో దెబ్బతీశారు...
మాది పేదకుటుంబం. మా గ్రామానికి చెందిన రైతు మిరియాల లోవరాజు పొలం కౌలుకు తీసుకుని చెరకు పంట సాగు చేస్తున్నాను. రైలు నుంచి సేకరించి పొలం కాకుండా మిగిలిన పొలంలో మట్టి వేశారు. పంట దెబ్బతింది. తీవ్రంగా నష్టపోయాను.
– పెంటకోట సత్తిబాబు, కౌలు రైతు – మామిడాడ.
.
Advertisement
Advertisement