మాది అభివృద్ధి యజ్ఞం | CM KCR Foundation Stone To Gattu Lift Irrigation In Mahabubnagar | Sakshi
Sakshi News home page

మాది అభివృద్ధి యజ్ఞం

Published Sat, Jun 30 2018 12:47 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

CM KCR Foundation Stone To Gattu Lift Irrigation In Mahabubnagar - Sakshi

శుక్రవారం గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం గద్వాల బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌. సభకు హాజరైన జనం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నా.. అన్ని వర్గాలకు మంచి చేయాలన్నా టీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన సీఎం తొలుత రాజోలి మండలంలో జరుగుతున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను పరిశీలించి అక్కడే అధికారులతో సమీక్షించారు. అనంతరం గట్టు మండలం పెంచికలపాడు వద్ద గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ‘నడిగడ్డ ప్రగతి సభ’పేరిట ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే... 

వాళ్లు సగం అంధకారంలో 
తెలంగాణను చాలా కష్టపడి సాధించుకున్నం. నేను కూడా చావు నోట్ల తలపెట్టి సాధించుకున్న రాష్ట్రం ఇది. గతంలో తెలంగాణ ప్రాజెక్టులు, ప్రజల సమస్యలంటే ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం. కానీ నేడు టీఆర్‌ఎస్‌ అలా కాదు. ఇదో యజ్ఞం. ఇదో పెద్ద టాస్కు.. చాలెంజింగ్‌గా తీసుకుని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నం. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లు పారే వరకు టీఆర్‌ఎస్‌ ఒక యజ్ఞంలా ప్రయత్నం చేస్తుంది. అలాగే కరెంట్‌ సమస్య అధిగమించినం. కరెంట్‌ ఇక జన్మల పోనియ్య. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి అనే ఒక వ్యక్తి కర్ర పట్టుకుని చూపించిండు. అంధకారమైపోతరన్నడు. కానీ వాళ్లే సగం అంధకారం అయ్యారు. మనం పూర్తి వెలుగులో ఉన్నం. దేశం మొత్తంలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్‌ ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని గర్వంగా ప్రకటిస్తున్నా. ఆ పథకాన్ని అలాగే కొనసాగిస్తం. 

సంక్షేమంలో మనమే నంబర్‌ 1 
సంక్షేమ పథకాల అమలులో యావత్‌ దేశంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. కేసీఆర్‌ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.42 వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నం. రూ.25 వేల కోట్లతో రైతులను ఆదుకుంటున్నం. రూ.96 వేల కోట్లతో విద్యుత్‌ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటున్నం. రూ.లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చకచకసాగుతున్నాయి. కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చి మన పథకాలు చూసి అభినందిస్తున్నరు. మన ఆడబిడ్డలు తలెత్తుకునే మరో అద్భుతమైన కార్యక్రమం మిషన్‌ భగీరథ త్వరలో పూర్తవుతుంది. చిన్నచిన్న ఉద్యోగస్తులకు మనవి చేస్తున్నా.. టీఆర్‌ఎస్‌ను గెలిపించండి. ఆశీర్వదించండి. భవిష్యత్తులో మరింత మంచి జరుగుతది. అలాగే రాష్ట్రం మొత్తంలో ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్‌ పాఠశాలలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. ఒక్కో విద్యార్థి కోసం రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 584 మండలాలు ఉన్నాయి. ప్రతీ మండలానికి బీసీ రెసిడెన్షియల్‌ రావాల్సి ఉంది. అందుకే రాష్ట్రంలో మరో 119 బీసీ రెసిడెన్షియల్స్‌ మంజూరు చేస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తాం. వీటిపై వెంటనే కేబినెట్‌ సమావేశం నిర్వహించి అనుమతులు మంజూరు చేస్తాం. 

అప్పుడే బంగారు తెలంగాణ.. 
నేను కూడా రైతునే. మేలో మంచిగ రెండు వానలు పడితే 60 ఎకరాలలో మక్కజొన్న పంట వేసిన. ప్రతీ రెండ్రోజులకు ఒక్కసారి ఫోన్‌ చేసి అడుగుత. వ్యవసాయంలో ఎన్ని కష్టాలు ఉంటయో నాకు తెలుసు. వ్యవసాయంలో ముందు దోపిడీ బంద్‌ కావాలి. రైతులకు నేను పెట్టుబడి ఇచ్చిన. కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నరు. భూస్వాములకు ఇచ్చినవంటున్నరు. తెలంగాణలో భూస్వాములు ఉన్నరా? ల్యాండ్‌ సీలింగ్‌ పెట్టినం. 54 ఎకరాలకు మించి లేకపాయే. ఇక భూస్వాములు ఎక్కడున్నరు? వాళ్ల పిచ్చి మాటలు కాకపోతే! అలాగే రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పక్కాగా ఉండేలా పాసు పుస్తకాలు అందజేస్తున్నం. పట్టాదారు పాసు పుస్తకంలో ఖాస్తుదారు పేరు ఎత్తేసి.. రైతు పేరు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నాం. హైదరాబాద్‌లో రూ.కోట్లు పెట్టి పెద్ద పెద్ద బంగ్లాలు కడతరు. వాటిల్లో కిరాయికి ఇస్తరు. వాటిల్లో కూడా అనుభవదారు పేరు రాద్దామా? రైతు ఏమైన అగ్గువ దొరికిండా? ప్రాణం పోయిన సరే.. పెట్టుబడి పథకం పట్టాదారు రైతుకే ఇస్తం. ఇలా మొత్తంగా రైతుల అప్పులు పోయి.. జేబులో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటనే బంగారు తెలంగాణ సాధించినట్లు. 

తెలంగాణకు వచ్చి నేర్చుకోవాలే.. 
రాష్ట్రంలో నాలుగు లక్షల టన్నుల గోదాముల మాత్రమే ఉండే. ఈ నాలుగేళ్లలో 23 లక్షల టన్నుల నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకున్నం. రాబోయే రోజుల్లో గ్రామ గోడౌన్‌లను నిర్మించే ఆలోచన చేస్తున్నం. ఏ ఊరి గోదాము ఆ ఊరిలో ఉంటే.. ఎరువుల, ధాన్యం అన్ని పెట్టుకునే పరిస్థితి ఉంటది. రైతు సమన్వయ సమితి ద్వారా రైతులకు దిశానిర్దేశం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అందరూ ఒకేసారి ఒకే పంట వేయడం వల్ల ధరలు పడిపోతున్నాయి. అందుకే మార్కెట్‌లో ఉండే ధరలను రాబట్టుకోవాలి. అందుకు వచ్చే ఏడాది నుంచి సలహాలు, సూచనలు అందజేసే వెసులుబాటు కలుగుతుంది. వాతావరణానికి తగ్గట్లు పంటలు, భూముల వివరాలు, నీటి లభ్యత వంటి వాటిని తెలియజేసే ‘ఆగ్రో క్‌లెమైట్‌ కండిషన్‌’’అందుబాటులోకి వస్తుంది. శాస్త్రవేత్తల పరిశోధనలు పూర్తికాగానే రాష్ట్రమంతా పంట కాలనీలను విభజించి మనం పండించే ప్రతీ గింజ డిమాండ్‌కు అనుగుణంగా సాగు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాం. దేశంలో మిగతా 28 రాష్ట్రాల రైతులు తెలంగాణకు పోయి నేర్చుకోవాలనే విధంగా పద్ధతులను తయారు చేస్తున్నం. కరెంట్, పెట్టుబడి, గిట్టుబాటు ధర రాబట్టే విషయంలో గొప్పగా చేసుకోబోతున్నాం. 

కాంగ్రెస్‌–టీడీపీ జట్టా.. సిగ్గుసిగ్గు?: హరీశ్‌రావు 
సమైక్య పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, ముఖ్యంగా పాలమూరు ప్రాంతానికి చేసిన నష్టం అంతా ఇంతా మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఈ ప్రాంతాన్ని చంద్రబాబు దత్తత తీసుకొని ఏమీ చేయకపోగా... ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్టీఆర్‌ మద్రాసులో కొన్నాళ్లు ఉన్నాననే విశ్వాసంతో తెలుగు గంగ చేపట్టారన్నారు. చంద్రబాబు మాత్రం దత్తత తీసుకున్న జిల్లా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్‌ నిస్సిగ్గుగా జతకడతామని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ ఒక సోషల్‌ ఇంజనీరుగా అవతారమెత్తి కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నారన్నారు. గోదావరి జలాలను ఉత్తర తెలంగాణతో పాటు ఖమ్మం జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు కూడా అందజేస్తామని వెల్లడించారు. కృష్ణా జలాలను ఉమ్మడి పాలమూరు జిల్లా, రంగారెడ్డి, నల్లగొండలో మిగిలిపోయిన భాగానికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి.నిరంజన్‌రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్సీలు కె.దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌ గౌడ్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్‌.రాజేందర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

తుమ్మిళ్ల డిజైన్లపై సీఎం సీరియస్‌ 
ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టు వరకు నీరందించే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డిజైన్ల విషయంలో సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పురోగతిపై ఆరా తీసిన ఆయన డిజైన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుంగభద్ర నుంచి నీటిని పంపింగ్‌ చేసే అప్రోచ్‌ చానల్‌ ఏర్పాటు సరిగా లేదన్నారు. నది చివరి నుంచి అప్రోచ్‌ చానల్‌ ఏర్పాటు చేయడం వల్ల ఆశించిన మేర నీరు తీసుకోలేమని, తద్వారా చివరి ఆయకట్టు వరకు ఎలా నీరు అందిస్తామని అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టు డిజైన్‌ రూపకల్పన విషయంలో ఈఎన్‌సీ మురళీధర్‌రావు, సీఈ తీరుపై మండిపడ్డారు. ఇలా చేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. తుమ్మిళ్ల డిజైన్‌ మార్పు వల్ల రూ.4 కోట్ల పనులు వృథా అయినా ఫర్వాలేదని రైతులకు లబ్ధి జరగడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. తుమ్మిళ్లకు నీటి లభ్యతను పెంపొందించడం కోసం ఎగువన మరో అప్రోచ్‌ చానల్‌ నిర్మించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఎగువన అప్రోచ్‌ చానల్‌ నిర్మించడానికి నదిలో సిల్టు ఎక్కువగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు. దీనికి కేసీఆర్‌ స్పందిస్తూ.. ‘అయినా ఫర్వాలేదు... ప్రాజెక్టులు మళ్లీ మళ్లీ నిర్మించలేం.. ఈ డిజైన్‌ ఎట్టి పరిస్థితిలో మార్చాల్సిందే. ఆర్డీఎస్‌ రైతాంగానికి న్యాయం జరగాలి. అలాగే రిజర్వాయర్ల కెపాసిటీని కూడా కాస్త పెంచండి’అని ఆదేశాలు జారీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement