lift irigation
-
లిఫ్టులను ప్రభుత్వమే నిర్వహించాలి!
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు త్రాగునీరు, సాగునీరు ఎక్కువగా వచ్చే అవకాశం లేకుండా పోతుందని ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న మొదట్లోనే నల్లగొండ జిల్లా ప్రజలు, అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ క్రమంలో ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు ఎడమ కాల్వపై ప్రత్యేకంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు ఏర్పాటు చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ లిఫ్టులు కూడా ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలియపరిచారు. కానీ అది నేటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల లిఫ్టుల ఆయకట్టు రైతులు నష్టపోతూనే ఉన్నారు. ప్రభుత్వం లిఫ్టులు ఏర్పాటు చేయటానికి ముందుకు రాకపోవడం వలన రైతులే స్వయంగా 1970లో కో–ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసుకొని భూములు బ్యాంకుల్లో కుదువ పెట్టి అప్పులు తీసుకుని 18 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు చేపట్టి 1980–81 వరకు నడిపించారు. తర్వాత వీటిని నిర్వహించడం తమ వల్ల కాదనీ, ప్రభుత్వమే నిర్వహించాలనీ పెద్ద ఎత్తున రైతులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దాని ఫలితంగా ఆనాటి ప్రభుత్వం ఐడీసీ డిపార్ట్మెంట్కు ఆ లిఫ్టుల నిర్వహణ బాధ్యతను అప్పగించింది. తర్వాత కాలంలో అంచెలంచెలుగా మొత్తం 54 లిఫ్టులు ఎడమ కాల్వపై ఐడీసీ ద్వారా ఏర్పాటు చేశారు. ఆనాడు లిఫ్టులకు కరెంటు సప్లై సరిగ్గా లేక సగం ఆయకట్టుకు కూడా నీళ్ళు అందని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో రైతుల ఇబ్బందులను గమనించి నాగార్జున సాగర్ నుండి నడిగూడెం మండలంలో ఉన్న చివరి లిఫ్టు వరకూ రైతులందరినీ వెంట తీసుకొని 2007లో సీపీఎం పాదయాత్ర నిర్వహించింది. నాతో పాటు నంద్యాల నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య, మరికొంత మంది నాయకులూ పాల్గొన్న ఈ పాదయాత్ర వారం రోజుల పాటు సాగింది. ఇది ప్రభుత్వం మీద బలమైన ఒత్తిడి కలుగజేసింది. ఫలితంగా... సెపరేట్ ఫీడర్ లైన్ నిర్మాణం జరిగి 18 గంటలు కరెంట్ సప్లై అయ్యే విధంగా ఏర్పాటు జరిగింది. అయినా తర్వాత కాలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లిఫ్టులు నడపలేని పరిస్థితి వచ్చింది. 2013–14లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునికీ కరణ పనులకు వరల్డ్ బ్యాంక్ అందించిన 4 వేల కోట్లలో రూ. 100 కోట్లు కేటా లిఫ్టుల మరమ్మతులకు కేటాయించారు. ఈ నిధులతో 50 శాతం పనులు మాత్రమే చేపట్టి వదిలేశారు. తర్వాత లిఫ్టుల నిర్వహణ బాధ్యతను ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్కు, తర్వాత ఐబీ డిపార్ట్మెంట్కు అప్పగించారు. బాధ్యత ఏ శాఖకు ఇచ్చినా శాశ్వత సిబ్బందిని మాత్రం నియమించలేదు. పైగా ఐబీ శాఖకు ఈ లిఫ్టులపై కనీస అవగాహన లేదు. ఈనాడు ఈ లిఫ్టులన్నీ పరిశీలిస్తే మోటార్లు, స్టార్టర్లు, కాల్వలు, తూములు దెబ్బతిని రైతులు నడపలేని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలోనూ; 2014, 2018 ఎన్నికల ప్రచార సభల్లోనూ; వారి ఎన్నికల మ్యానిఫెస్టోలో సాగర్ ఎడమ కాల్వపై ఉన్న లిఫ్టులన్నింటినీ ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వమే నడిపిస్తుందని హామీ ఇచ్చారు. కానీ అమలు మర చారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వపై ఉన్న లిఫ్టులను ప్రభుత్వమే నడిపించాలి. యుద్ధ ప్రాతిపదికపైన మరమ్మతులు చేపట్టాలి. బావుల, కాల్వల పూడికలు; తూములు, మోటార్లు, షట్టర్లు, ప్యానల్ బోర్డులు, పంపులు, పైప్ లైన్స్ తదితర పనులు చేపట్టాలి. లిఫ్టుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాలి. లిఫ్టుల నిర్వహణ బాధ్యత ఐడీసీకి అప్పజెప్పాలి. వీరి న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నల్లగొండ ఐబీసీఈ ఆఫీసు ముందు నేడు (జూన్ 27) ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. (క్లిక్: శాస్త్రశోధనల గొంతు నొక్కితే ఎలా?) - జూలకంటి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం నాయకుడు -
రైతులకు అందేనా నీరు?
ఖమ్మంఅర్బన్: రైతుల పంట పొలాలకు సాగు నీరందించేందుకు ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు(లిఫ్టులు) చాలాచోట్ల నిరుపయోగంగా మారాయి. ఆయకట్టులో పంటలు పండించాలనుకున్న రైతుల ఆశలు ఆవిరై.. జలాలందక ఎండిన పైర్లతో వీరి తలరాతలు మారని దైన్యం నెలకొంది. జిల్లాలో సాగర్ కాల్వ నీరే ఆధారం. ఈ కాల్వలపై, అడపా దడపా పారే ఏర్లపై పలుచోట్ల నిర్మించిన ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లావ్యాప్తంగా 50వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనేది లక్ష్యం. పైపులు, విద్యుత్ మోటార్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ లిఫ్టులు మూలనపడ్డాయి. రైతుల భాగస్వామ్యంతోనే మరమ్మతులు చేయించుకోవాల్సి ఉండడంతో..పట్టించుకునేవారు కరువయ్యారు. పంటల పెట్టుబడి, నష్టాలతోనే సాగుదారులు అవస్థ పడుతున్న క్రమంలో ఈ మరమ్మతుల వ్యయం వీరికి పెనుభారంగా మారుతోంది. చివరి భూములకు నీరందడం లేదని ఆ రైతులు విముఖత చూపుతుండడంతో మరింత నిర్లక్ష్యం నెలకొంటోంది. ఖమ్మం జిల్లాలో 135 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. 35 లిఫ్టులు పాక్షికంగా పని చేస్తుండగా.. 10,991 ఎకరాలకు నీరందుతోంది. మరో 49 ఎత్తిపోతల పథకాలు అసలు పనిచేయట్లేదు. ఇవి వ్యవసాయ భూములకు చుక్కనీరు అందించలేకపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 51 లిఫ్టుల ద్వారా 30,247 ఎకరాలకు మాత్రమే పుష్కలంగా నీరందుతోంది. మూడు కొత్త పథకాలకు రూ.29కోట్లు జిల్లాలో మూడు కొత్త లిఫ్టు ఇరిగేషన్ పథకాల నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం రూ.29.41కోట్లు మంజూరు చేసింది. కల్లూరు మండలం కొర్లకుంట, మధిర మండలం మాధవీపురం, బోనకల్ మండలం రాపల్లెలో వీటిని నిర్మించనున్నారు. వీటి ద్వారా నాలుగు వేల ఎకరాలకు సాగునీరందించాలనేది లక్ష్యం. మరమ్మతుల నిధులు ఇలా.. జిల్లాలో మూడు ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు గతంలో రూ.4.12కోట్లు మంజూరయ్యాయి. రఘునాథపాలెం మండలం జాన్‌బాద్‌తండా లిఫ్టు, కూసుమంచి మండలం నరసింహులగూడెం, చింతకాని మండలం కొదుమూరు లిఫ్ట్‌కు అదనపు పైపులైన్ల కోసం కేటాయించారు. జిల్లాలో లిఫ్టుల రిపేర్ల కోసం రూ.2కోట్లతో గతంలోనే అంచనాలు పంపినట్లు సమాచారం. మోటార్ల మరమ్మతులు, పంపు సెట్లు, పైపులైన్ల పనులు చేసే అవకాశముంది. పాలేరు నియోజకవర్గంలోని కామంచికల్ లిఫ్టు నిర్మాణానికి రూ.12కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు వెళ్లాయి. రైతుల భాగస్వామ్యం ఉండాలి.. లిఫ్టు ఇరిగేషన్ల నిర్వహణలో రైతుల భాగస్వామ్యం ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి. జిల్లాలో పనిచేయని ఎత్తిపోతల పథకాల మరమ్మతు కోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలోనే ప్రతిపాదనలు పంపించాం. కొన్నింటికి నిధులు మంజూరయ్యాయి. కొన్ని కొత్త పథకాలు కూడా వచ్చాయి. ఇంకా.. కొన్నింటి ప్రక్రియ నడుస్తోంది. రైతులంతా కలిసికట్టుగా ఉంటే.. సాగునీటి కష్టాలు తొలగుతాయి. – విద్యాసాగర్, ఐడీసీ ఈఈ -
మాది అభివృద్ధి యజ్ఞం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నా.. అన్ని వర్గాలకు మంచి చేయాలన్నా టీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన సీఎం తొలుత రాజోలి మండలంలో జరుగుతున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను పరిశీలించి అక్కడే అధికారులతో సమీక్షించారు. అనంతరం గట్టు మండలం పెంచికలపాడు వద్ద గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ‘నడిగడ్డ ప్రగతి సభ’పేరిట ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే... వాళ్లు సగం అంధకారంలో తెలంగాణను చాలా కష్టపడి సాధించుకున్నం. నేను కూడా చావు నోట్ల తలపెట్టి సాధించుకున్న రాష్ట్రం ఇది. గతంలో తెలంగాణ ప్రాజెక్టులు, ప్రజల సమస్యలంటే ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం. కానీ నేడు టీఆర్ఎస్ అలా కాదు. ఇదో యజ్ఞం. ఇదో పెద్ద టాస్కు.. చాలెంజింగ్‌గా తీసుకుని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నం. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లు పారే వరకు టీఆర్ఎస్ ఒక యజ్ఞంలా ప్రయత్నం చేస్తుంది. అలాగే కరెంట్ సమస్య అధిగమించినం. కరెంట్ ఇక జన్మల పోనియ్య. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి అనే ఒక వ్యక్తి కర్ర పట్టుకుని చూపించిండు. అంధకారమైపోతరన్నడు. కానీ వాళ్లే సగం అంధకారం అయ్యారు. మనం పూర్తి వెలుగులో ఉన్నం. దేశం మొత్తంలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని గర్వంగా ప్రకటిస్తున్నా. ఆ పథకాన్ని అలాగే కొనసాగిస్తం. సంక్షేమంలో మనమే నంబర్ 1 సంక్షేమ పథకాల అమలులో యావత్ దేశంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.42 వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నం. రూ.25 వేల కోట్లతో రైతులను ఆదుకుంటున్నం. రూ.96 వేల కోట్లతో విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటున్నం. రూ.లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చకచకసాగుతున్నాయి. కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చి మన పథకాలు చూసి అభినందిస్తున్నరు. మన ఆడబిడ్డలు తలెత్తుకునే మరో అద్భుతమైన కార్యక్రమం మిషన్ భగీరథ త్వరలో పూర్తవుతుంది. చిన్నచిన్న ఉద్యోగస్తులకు మనవి చేస్తున్నా.. టీఆర్ఎస్ను గెలిపించండి. ఆశీర్వదించండి. భవిష్యత్తులో మరింత మంచి జరుగుతది. అలాగే రాష్ట్రం మొత్తంలో ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. ఒక్కో విద్యార్థి కోసం రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 584 మండలాలు ఉన్నాయి. ప్రతీ మండలానికి బీసీ రెసిడెన్షియల్ రావాల్సి ఉంది. అందుకే రాష్ట్రంలో మరో 119 బీసీ రెసిడెన్షియల్స్ మంజూరు చేస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తాం. వీటిపై వెంటనే కేబినెట్ సమావేశం నిర్వహించి అనుమతులు మంజూరు చేస్తాం. అప్పుడే బంగారు తెలంగాణ.. నేను కూడా రైతునే. మేలో మంచిగ రెండు వానలు పడితే 60 ఎకరాలలో మక్కజొన్న పంట వేసిన. ప్రతీ రెండ్రోజులకు ఒక్కసారి ఫోన్ చేసి అడుగుత. వ్యవసాయంలో ఎన్ని కష్టాలు ఉంటయో నాకు తెలుసు. వ్యవసాయంలో ముందు దోపిడీ బంద్ కావాలి. రైతులకు నేను పెట్టుబడి ఇచ్చిన. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నరు. భూస్వాములకు ఇచ్చినవంటున్నరు. తెలంగాణలో భూస్వాములు ఉన్నరా? ల్యాండ్ సీలింగ్ పెట్టినం. 54 ఎకరాలకు మించి లేకపాయే. ఇక భూస్వాములు ఎక్కడున్నరు? వాళ్ల పిచ్చి మాటలు కాకపోతే! అలాగే రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పక్కాగా ఉండేలా పాసు పుస్తకాలు అందజేస్తున్నం. పట్టాదారు పాసు పుస్తకంలో ఖాస్తుదారు పేరు ఎత్తేసి.. రైతు పేరు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నాం. హైదరాబాద్‌లో రూ.కోట్లు పెట్టి పెద్ద పెద్ద బంగ్లాలు కడతరు. వాటిల్లో కిరాయికి ఇస్తరు. వాటిల్లో కూడా అనుభవదారు పేరు రాద్దామా? రైతు ఏమైన అగ్గువ దొరికిండా? ప్రాణం పోయిన సరే.. పెట్టుబడి పథకం పట్టాదారు రైతుకే ఇస్తం. ఇలా మొత్తంగా రైతుల అప్పులు పోయి.. జేబులో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటనే బంగారు తెలంగాణ సాధించినట్లు. తెలంగాణకు వచ్చి నేర్చుకోవాలే.. రాష్ట్రంలో నాలుగు లక్షల టన్నుల గోదాముల మాత్రమే ఉండే. ఈ నాలుగేళ్లలో 23 లక్షల టన్నుల నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకున్నం. రాబోయే రోజుల్లో గ్రామ గోడౌన్లను నిర్మించే ఆలోచన చేస్తున్నం. ఏ ఊరి గోదాము ఆ ఊరిలో ఉంటే.. ఎరువుల, ధాన్యం అన్ని పెట్టుకునే పరిస్థితి ఉంటది. రైతు సమన్వయ సమితి ద్వారా రైతులకు దిశానిర్దేశం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అందరూ ఒకేసారి ఒకే పంట వేయడం వల్ల ధరలు పడిపోతున్నాయి. అందుకే మార్కెట్లో ఉండే ధరలను రాబట్టుకోవాలి. అందుకు వచ్చే ఏడాది నుంచి సలహాలు, సూచనలు అందజేసే వెసులుబాటు కలుగుతుంది. వాతావరణానికి తగ్గట్లు పంటలు, భూముల వివరాలు, నీటి లభ్యత వంటి వాటిని తెలియజేసే ‘ఆగ్రో క్‌లెమైట్ కండిషన్’’అందుబాటులోకి వస్తుంది. శాస్త్రవేత్తల పరిశోధనలు పూర్తికాగానే రాష్ట్రమంతా పంట కాలనీలను విభజించి మనం పండించే ప్రతీ గింజ డిమాండ్‌కు అనుగుణంగా సాగు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాం. దేశంలో మిగతా 28 రాష్ట్రాల రైతులు తెలంగాణకు పోయి నేర్చుకోవాలనే విధంగా పద్ధతులను తయారు చేస్తున్నం. కరెంట్, పెట్టుబడి, గిట్టుబాటు ధర రాబట్టే విషయంలో గొప్పగా చేసుకోబోతున్నాం. కాంగ్రెస్–టీడీపీ జట్టా.. సిగ్గుసిగ్గు?: హరీశ్‌రావు సమైక్య పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, ముఖ్యంగా పాలమూరు ప్రాంతానికి చేసిన నష్టం అంతా ఇంతా మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఈ ప్రాంతాన్ని చంద్రబాబు దత్తత తీసుకొని ఏమీ చేయకపోగా... ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్టీఆర్ మద్రాసులో కొన్నాళ్లు ఉన్నాననే విశ్వాసంతో తెలుగు గంగ చేపట్టారన్నారు. చంద్రబాబు మాత్రం దత్తత తీసుకున్న జిల్లా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ నిస్సిగ్గుగా జతకడతామని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఒక సోషల్ ఇంజనీరుగా అవతారమెత్తి కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నారన్నారు. గోదావరి జలాలను ఉత్తర తెలంగాణతో పాటు ఖమ్మం జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు కూడా అందజేస్తామని వెల్లడించారు. కృష్ణా జలాలను ఉమ్మడి పాలమూరు జిల్లా, రంగారెడ్డి, నల్లగొండలో మిగిలిపోయిన భాగానికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి.నిరంజన్‌రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్సీలు కె.దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తుమ్మిళ్ల డిజైన్లపై సీఎం సీరియస్ ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు నీరందించే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డిజైన్ల విషయంలో సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పురోగతిపై ఆరా తీసిన ఆయన డిజైన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుంగభద్ర నుంచి నీటిని పంపింగ్ చేసే అప్రోచ్ చానల్ ఏర్పాటు సరిగా లేదన్నారు. నది చివరి నుంచి అప్రోచ్ చానల్ ఏర్పాటు చేయడం వల్ల ఆశించిన మేర నీరు తీసుకోలేమని, తద్వారా చివరి ఆయకట్టు వరకు ఎలా నీరు అందిస్తామని అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టు డిజైన్ రూపకల్పన విషయంలో ఈఎన్సీ మురళీధర్‌రావు, సీఈ తీరుపై మండిపడ్డారు. ఇలా చేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. తుమ్మిళ్ల డిజైన్ మార్పు వల్ల రూ.4 కోట్ల పనులు వృథా అయినా ఫర్వాలేదని రైతులకు లబ్ధి జరగడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. తుమ్మిళ్లకు నీటి లభ్యతను పెంపొందించడం కోసం ఎగువన మరో అప్రోచ్ చానల్ నిర్మించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఎగువన అప్రోచ్ చానల్ నిర్మించడానికి నదిలో సిల్టు ఎక్కువగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు. దీనికి కేసీఆర్ స్పందిస్తూ.. ‘అయినా ఫర్వాలేదు... ప్రాజెక్టులు మళ్లీ మళ్లీ నిర్మించలేం.. ఈ డిజైన్ ఎట్టి పరిస్థితిలో మార్చాల్సిందే. ఆర్డీఎస్ రైతాంగానికి న్యాయం జరగాలి. అలాగే రిజర్వాయర్ల కెపాసిటీని కూడా కాస్త పెంచండి’అని ఆదేశాలు జారీ చేశారు. -
విధ్వంసం
- రైతు ప్రయోజనాల పాతర - లిఫ్ట్ ఇరిగేషన్ పైపులైన్ పనుల కోసం చెరకు తోటలు «ధ్వంసం - కాలువ తవ్వకం మట్టితో చెరకు తోటలకు నష్టం - మామిడాడలో రైతులు గోడు పట్టించుకోని కాంట్రాక్టు సంస్థ - నేటికీ దక్కని పరిహారం జగ్గంపేట : ఎత్తిపోతల పథకాలు పేరిట రూ.కోట్లు ధనాన్ని లూటీ చేస్తున్న టీడీపీ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులను బలితీసుకుంటోంది. అఖండ గోదావరి నుంచి ఏలేరు ఆయకట్టుకు నీటిని అందించే వంకతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి బీజం వేసి పర్సంటేజీ ల హడావుడిలో రైతులకు రావల్సిన పరిహారం విషయాన్ని పట్టించుకోవడం లేదు. గోదావరి జలాలను సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి పంపింగ్ చేసుందుకు రూ.1,638 కోట్లతో ప్రణాళిక వేశారు. పురుషోత్తపట్నం స్టేజ్-1, రామవరం నుంచి ఏలేరుకి నీటిని తరలించేందుకు స్టేజ్-2గా పనులు విభజించారు. ఈ పథకం కోసం భూములను రైతుల నుంచి బలవంతంగా సేకరించగా సీతానగరం మండలంలో నిరసనలు వ్యక్తం కావడంతో పరిహారం పెంచి బుజ్జగించారు. గోదావరి నుంచి 3,500 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ంగ్ చేసి పోలవరం కాలువలో విడిచిపెట్టి, అక్కడ నుంచి 58 కిలోమీటర్లు ఉన్న రామవరం వద్ద స్టేజ్-2లో నిర్మించే పంప్‌హౌస్ ద్వారా 1,400 క్యూసెక్కుల నీటిని ఏలేరు రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేసేందుకు ప్రతిపాదించారు. రామవరం వద్ద పంప్హౌప్ పనులు చేపడుతున్నారు. రామవరం నుంచి ఏలేరు ప్రాజెక్టు వరకు సుమారు 13.12 కిలోమీటర్ల మేర పైపులైను నిర్మించాల్సి ఉంది. . పరిహారం చెల్లించకుండానే తవ్వకాలు జగ్గంపేట మండలంలో రామవరం, మర్రిపాక, గొల్లలగుంట, ఇర్రిపాక, మామిడాడ గ్రామాలతోపాటు ఏలేశ్వరం మండలంలో అప్పనపాలెం మీదుగా పైపులైన్ రెండు వరసల్లో వేయాల్సి ఉంది. ఇక్కడ సేకరించిన భూములకు పరిహారం నిర్థారించకుండానే పనులు చేపట్టడంతో రామవరంలో రైతులు ఆందోళనలు చేశారు. పైపులైన్ కోసం మండలంలోని సుమారు వంద ఎకరాలు సేకరించగా వీటిలో ప్రభుత్వ భూమి మినహయిస్తే సుమారు 95 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. జాతీయ రహదారిని ఆనుకుని రామవరం గ్రామం ఉండడంతో ఎకరాకు సుమారు రూ.26 లక్షలు, మిగిలిన గ్రామాలకు రూ.22.5 లక్షల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు రైతులకు పరిహారం ఇవ్వవల్సి ఉండగా నేటికీ ఆ ఊసే ఎత్తడం లేదు. మరో వైపు పైప్‌లైన్ పనులు మాత్రం ముమ్మరంగా చేపడుతున్నారు. . తీవ్ర నష్టం... రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు కాంట్రాక్టు పొందిన మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిడెడ్ సంస్థ తన ఇష్టానుసారం ముందుకు సాగడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పరిహారం అందక ఆందోళనలో ఉన్న రైతులకు పైపులైన్ పనులు మింగుడు పడడం లేదు. సేకరించిన భూమిని దాటిపోయి పైపు లైన్‌కోసం తవ్వే మట్టిని వేస్తున్నారు. దీంతో పంటను రైతులు నష్టపోతున్నారు. + మండలంలోని రామవరం గ్రామంలో ఒక రైతుకు చెందిన పామాయిల్ తోటలో చెట్లను నరికివేయగా రాజకీయ పెద్దల జోక్యంతో అడ్డుకట్టపడింది. + రెండు రోజుల కిందట మండలంలోని మమాడాడ గ్రామంలో మిరియాల లోవరాజుకు చెందిన పొలంలో పైపులైన్ పనులు చేపడుతూ మట్టిన సేకరించి స్థలానికి అవతల వేయడంతో కౌలు చేసుకుంటున్న పెంటకోట సత్తిబాబు సుమారు ఏడు టన్నుల చెరకు పంటను నష్టపోవల్సి వచ్చింది. దీంతో వారు కాంట్రాక్టు సంస్థ సిబ్బందిని పనులు నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. రైతుల ప్రయోజలను దెబ్బతీసేలా పనుల చేపట్టడం దారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్ శివమ్మను వివరణ కోరగా రైతులకు పరిహారం జూన్‌లో వస్తుందన్నారు. పంటలపై మట్టి వేయకూడదని దీనిపై రైతులకు నష్టం లేకుండా పనులు జరిగేలా కాంట్రాక్టు సంస్థకు సూచనలు ఇస్తామన్నారు. . పరిహారం ఇవ్వలేదు ... పురుషోత్తపట్నం పైపులైన్ కోసం భూమిని తీసుకున్నారు. నాకు 96 సెంట్లు మాత్రమే ఉంది. సుమారు 20 సెంట్లు పైపులైన్‌కు కోల్పోయాను. పరిహారం ఇవ్వలేదు. పంటలను ధ్వంసం చేయడం సమంజసం కాదు. – మిరియాల లోవరాజు, రైతు – మామిడాడ. కౌలు భూమిలో చెరకు పంటను మట్టితో దెబ్బతీశారు... మాది పేదకుటుంబం. మా గ్రామానికి చెందిన రైతు మిరియాల లోవరాజు పొలం కౌలుకు తీసుకుని చెరకు పంట సాగు చేస్తున్నాను. రైలు నుంచి సేకరించి పొలం కాకుండా మిగిలిన పొలంలో మట్టి వేశారు. పంట దెబ్బతింది. తీవ్రంగా నష్టపోయాను. – పెంటకోట సత్తిబాబు, కౌలు రైతు – మామిడాడ. . -
నిధుల ఎత్తిపోతలకేనా!
కొవ్వూరు : ఓవైపు పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తిచేస్తామంటున్న సర్కారు మరోవైపు గోదావరిపై కొత్త ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం పూర్తయితే ఈ పథకం అవసరం ఏముంటుందని నీటిపారుదల నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా గోదావరిపై తూర్పుగోదావరి జిల్లాలో నిర్మించనున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రూ.1,638 కోట్లు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకాన్ని చేపడుతున్నది నిధులను ఎత్తి జేబుల్లో పోసుకోవడానికా? లేక ప్రభుత్వం చెబుతున్నట్టు పోలవరం పథకం రెండేళ్లలో పూర్తికాదా? అనే సందేహాలు అందరినీ వేధిస్తున్నాయి. ఆ పథకం పనుల తీరు పరిశీలించినా ఇదే భావం కలుగుతోంది. ప్రాజెక్టును రెండేళ్లలోనే పూర్తిచేసేట్టయితే గోదావరిపై కొత్త ఎత్తిపోతల పథకాల అవసరం ఉండదు. కానీ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో రూ.1,638 కోట్లు వెచ్చించి పురుషోత్తపట్నం ఎత్తిపోతల నిర్మాణానికి సర్కారు సిద్ధం కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఇలాగే తహతహలాడిన సర్కారు రూ.1420 కోట్లు వెచ్చించింది. అయినా ఆ పథకం లక్ష్యం నెరవేరలేదు. దీనిద్వారా నిర్దేశించిన లక్ష్యంలో సగం నీటిని కూడా కృష్ణానదికి తరలించలేకపోయింది. ఈ పథకం లక్ష్యం పూర్తిగా నెరవేరే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. అయితే వచ్చే సీజన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం వెంపర్లాడుతోంది. ఈ పథకం పూర్తి కావాలంటే రెండేళ్ల సమయం పడుతుంది. ఆ సమయానికి పోలవరం పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇక దీని అవసరం ఏముందనే విషయాన్ని విస్మరిస్తోందని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తికాదా! లేక పథకం ప్రకారమే రూ.కోట్లు కొల్లగొట్టేందుకు సర్కారు యత్నిస్తోందా! అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘పట్టిసీమ’తో తరలించింది 22 టీఎంసీలే అత్యంత ఆర్భాటంగా చేపట్టిన పట్టిసీమ పథకం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 29 టీఎంసీల నీటిని మాత్రమే కృష్ణానదికి తరలించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ 24 పంపులు ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో పనిచేసింది తక్కువ రోజులేనని చెప్పాలి. ఈ పథకం ద్వారా కృష్ణా ఆయకట్టులో 10 లక్షల ఎకరాలకు నీటిని అందించామని నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెబుతున్న మాటలు వట్టిదేనని దీనిని బట్టి అర్థమవుతోంది. సాధారణంగా ఒక టీఎంసీ నీటితో గరిష్టంగా 11,500 ఎకరాల వరి పంటకు నీరు అందించవచ్చు. ఈ లెక్కన ఎక్కువంటే 30 టీఎంసీల నీరు సరఫరా అయితే 3.45లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది. పట్టిసీమ ద్వారా 29 టీఎంసీలనే కృష్ణానదికి తరలించారు. మరి పదిలక్షల ఎకరాలకు నీరు ఎక్కడ అందించారన్నది ప్రభుత్వమే చెప్పాలి. పుంజుకోని పోలవరం పనులు పోలవరం : ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనుల తీరును పరిశీలిస్తే ఇది ఎప్పటికి పూర్తవుతుందనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, పవర్ హౌస్, అప్రోచ్ చానల్ పనులకు సంబంధించి 10.83 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయాల్సి ఉంది. మూడేళ్లుకుపైగా ఈ పనులు జరుగుతున్నా.. ఇప్పటి వరకు 4.50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇటీవల కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ జీతాలు చెల్లించడం లేదని కార్మికులు, పెండింగ్ బకాయిలు ఇవ్వడం లేదని సబ్‌కాంట్రాక్టు సంస్థ త్రివేణి పదిరోజులు పనులు నిలిపివేశాయి. ఇటీవల చంద్రబాబు స్వయంగా పనులను పరిశీలించి రోజుకు 2.20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం (ఎర్్తవర్క్) పనులు పూర్తి చేయాలని ఆదేశించినా, రోజుకు 50 వేల క్యూబిక్ మీటర్ల పనులు మాత్రమే చేస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో స్పిల్‌వే నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినా ఆ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. ఇలాగైతే సీఎం చెబుతున్నట్టు 2018 నాటికి పోలవరం పూర్తి చేయడం అసాధ్యమని నీటిపారుదల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. -
ఎత్తిపోతలకు జలకళ
తరలివస్తున్న పర్యాటకులు మాచర్ల రూరల్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎత్తిపోతల జలపాతానికి వర్షపు నీరు భారీగా చేరుకోవటంతో జలకళతో కళకళలాడుతుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలో చంద్రవంక, కొత్తపల్లి తాటివాగు, ఈదురవాగులు భారీగా పొంగి ప్రవహిస్తుండటంతో ఆ నీరు ఎత్తిపోతల జలపాతానికి చేరుకుంటుంది. దీంతో జలపాతం నుంచి పెద్ద ఎత్తున నీరు కిందకు జాలువారుతోంది. 2004 తర్వాత ఇంత పెద్ద ఎత్తున నీరు చేరుకోవటం, 70 అడుగుల నుంచి∙నీరు జాలువారుతుండటంతో చూపరులను ఆకర్షిస్తోంది. జలపాతాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు.