నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు త్రాగునీరు, సాగునీరు ఎక్కువగా వచ్చే అవకాశం లేకుండా పోతుందని ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న మొదట్లోనే నల్లగొండ జిల్లా ప్రజలు, అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ క్రమంలో ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు ఎడమ కాల్వపై ప్రత్యేకంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు ఏర్పాటు చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ లిఫ్టులు కూడా ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలియపరిచారు. కానీ అది నేటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల లిఫ్టుల ఆయకట్టు రైతులు నష్టపోతూనే ఉన్నారు.
ప్రభుత్వం లిఫ్టులు ఏర్పాటు చేయటానికి ముందుకు రాకపోవడం వలన రైతులే స్వయంగా 1970లో కో–ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసుకొని భూములు బ్యాంకుల్లో కుదువ పెట్టి అప్పులు తీసుకుని 18 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు చేపట్టి 1980–81 వరకు నడిపించారు. తర్వాత వీటిని నిర్వహించడం తమ వల్ల కాదనీ, ప్రభుత్వమే నిర్వహించాలనీ పెద్ద ఎత్తున రైతులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దాని ఫలితంగా ఆనాటి ప్రభుత్వం ఐడీసీ డిపార్ట్‌మెంట్‌కు ఆ లిఫ్టుల నిర్వహణ బాధ్యతను అప్పగించింది. తర్వాత కాలంలో అంచెలంచెలుగా మొత్తం 54 లిఫ్టులు ఎడమ కాల్వపై ఐడీసీ ద్వారా ఏర్పాటు చేశారు. ఆనాడు లిఫ్టులకు కరెంటు సప్లై సరిగ్గా లేక సగం ఆయకట్టుకు కూడా నీళ్ళు అందని పరిస్థితి ఏర్పడింది.
అలాంటి పరిస్థితుల్లో రైతుల ఇబ్బందులను గమనించి నాగార్జున సాగర్ నుండి నడిగూడెం మండలంలో ఉన్న చివరి లిఫ్టు వరకూ రైతులందరినీ వెంట తీసుకొని 2007లో సీపీఎం పాదయాత్ర నిర్వహించింది. నాతో పాటు నంద్యాల నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య, మరికొంత మంది నాయకులూ పాల్గొన్న ఈ పాదయాత్ర వారం రోజుల పాటు సాగింది. ఇది ప్రభుత్వం మీద బలమైన ఒత్తిడి కలుగజేసింది. ఫలితంగా... సెపరేట్ ఫీడర్ లైన్ నిర్మాణం జరిగి 18 గంటలు కరెంట్ సప్లై అయ్యే విధంగా ఏర్పాటు జరిగింది. అయినా తర్వాత కాలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లిఫ్టులు నడపలేని పరిస్థితి వచ్చింది.
2013–14లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునికీ కరణ పనులకు వరల్డ్ బ్యాంక్ అందించిన 4 వేల కోట్లలో రూ. 100 కోట్లు కేటా లిఫ్టుల మరమ్మతులకు కేటాయించారు. ఈ నిధులతో 50 శాతం పనులు మాత్రమే చేపట్టి వదిలేశారు. తర్వాత లిఫ్టుల నిర్వహణ బాధ్యతను ఎన్‌ఎస్‌పీ డిపార్ట్‌మెంట్‌కు, తర్వాత ఐబీ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. బాధ్యత ఏ శాఖకు ఇచ్చినా శాశ్వత సిబ్బందిని మాత్రం నియమించలేదు. పైగా ఐబీ శాఖకు ఈ లిఫ్టులపై కనీస అవగాహన లేదు. ఈనాడు ఈ లిఫ్టులన్నీ పరిశీలిస్తే మోటార్లు, స్టార్టర్లు, కాల్వలు, తూములు దెబ్బతిని రైతులు నడపలేని పరిస్థితి ఏర్పడింది.
కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలోనూ; 2014, 2018 ఎన్నికల ప్రచార సభల్లోనూ; వారి ఎన్నికల మ్యానిఫెస్టోలో సాగర్ ఎడమ కాల్వపై ఉన్న లిఫ్టులన్నింటినీ ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వమే నడిపిస్తుందని హామీ ఇచ్చారు. కానీ అమలు మర చారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వపై ఉన్న లిఫ్టులను ప్రభుత్వమే నడిపించాలి. యుద్ధ ప్రాతిపదికపైన మరమ్మతులు చేపట్టాలి. బావుల, కాల్వల పూడికలు; తూములు, మోటార్లు, షట్టర్లు, ప్యానల్ బోర్డులు, పంపులు, పైప్ లైన్స్ తదితర పనులు చేపట్టాలి. లిఫ్టుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాలి. లిఫ్టుల నిర్వహణ బాధ్యత ఐడీసీకి అప్పజెప్పాలి. వీరి న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నల్లగొండ ఐబీసీఈ ఆఫీసు ముందు నేడు (జూన్ 27) ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. (క్లిక్: శాస్త్రశోధనల గొంతు నొక్కితే ఎలా?)
- జూలకంటి రంగారెడ్డి
మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment