ఉద్యమకారుడైనందుకు.. ఉద్యోగం ఊడింది
► ఆర్టీసీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విద్యాసాగర్
► తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఊడిన ఉద్యోగం
సిద్దిపేట కల్చరల్: ఆర్టీసీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ.. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు ఓ ఉద్యమకారుడి ఉద్యోగం ఊడింది. దీంతో అతడు ఇంటికి వెళ్లలేక గుడిలోనే జీవనం సాగిస్తున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన వనపర్తి విద్యాసాగర్ 1988లో కడప బస్ డిపోలో సెక్యూరిటీగార్డుగా విధుల్లో చేరాడు. అక్కడ కొన్నేళ్లు పనిచేశాక అనంతపూర్‌కు, అక్కడి నుంచి జగిత్యాల డిపోకు బదిలీ చేశారు.
అప్పట్లో ఇతను స్వరాష్ట్రం తెలంగాణ కావాలని బలంగా కోరుకున్నాడు. కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యోగం చేస్తూనే స్వరాష్ట్రం వచ్చే దాకా అఖండ అయ్యప్పమాలను స్వీకరించి, శబరిమలైకి ప్రతి సంవత్సరం పాదయాత్రగా వెళుతున్నాడు. ఇందుకోసం తనకున్న కొద్దిపాటి భూమిని.. భార్య మెడలోని పుస్తెల తాడును అమ్మేశాడు. ఈ క్రమంలో ఓసారి విద్యాసాగర్‌ను కేసీఆర్ సన్మానించారు కూడా. అరుుతే, విద్యాసాగర్ ఉద్యమంలో పాల్గొనడం నచ్చని అప్పటి ఆంధ్ర అధికారి ఇతడిని విధుల నుంచి తొలగించారు.
దీంతో తన బాధను అప్పటి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌కు మొరపెట్టుకోవడంతో.. ఆయన చొరవతో మెట్‌పల్లి బస్ డిపోలో సెక్యూరిటీ గార్డుగా పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. మళ్లీ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడనే కారణంతో ఆరు నెలల్లోనే విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు కాగితం చేతిలో పట్టారు. దీంతో పిల్లలను చదివించే స్థోమత లేక.. భార్యకు మొహం చూపలేక ఎంతగానో మదనపడ్డాడు.
దసరా రోజు..
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ దసరా రోజు సిద్దిపేట జిల్లాను ప్రారంభిస్తారని తెలుసుకొని మళ్లీ తన గోడును చెప్పుకోవడానికి సిద్దిపేటకు వచ్చాడు. కానీ అది సాధ్యపడలేదు. ఇతర ప్రజా ప్రతినిధులకైనా గోడు చెబుతామనుకుంటే వీలుకాకపోవడంతో ఇక చేసేది లేక.. సిద్దిపేట అయ్యప్ప దేవాలయంలోనే కాలం వెల్లదీస్తున్నాడు. ఏనాటికైనా సీఎం కేసీఆర్‌ను సిద్దిపేటలోనే కలుస్తాననీ, తన గోడు చెప్పుకొంటానని ఆశతో ఎదురు చూస్తున్నాడు.
సీఎం చొరవ చూపాలి
తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించడంతో.. ఆర్టీసీలోని ఆంధ్ర అధికారి సంపత్‌కుమార్‌కు కోపం వచ్చింది. నన్ను రెండుసార్లు సెక్యూరిటీ గార్డు ఉద్యోగంలోనుంచి తీసేశారు. సర్వం కోల్పోయిన నాకు మళ్లీ నా జాబ్ కావాలి. కేసీఆర్, ఇతర నాయకులు తలచుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు. కాస్త జాలి చూపి, నా కుటుంబాన్ని ఆదుకోండి. మీ కాళ్లకు దండం పెడతా. - విద్యాసాగర్, బాధితుడు