
బెజవాడలో అధికారుల అత్యుత్సాహం
విజయవాడ: బెజవాడలో అర్థరాత్రి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్ల విస్తరణ పేరుతో పోలీస్ కంట్రోల్ రూం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించే యత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత విగ్రహం తొలగించేందుకు అధికారులు భారీగా యంత్రాలను మెహరించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, పార్టీ నేతలు జోగి రమేష్, కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. వైఎస్సార్‌సీపీ నేతలను, కార్పొరేటర్లను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు విగ్రహం తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నేతలు అధికారులకు సూచించారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ భారీ యంత్రాలతో విగ్రహన్ని తొలగించారు. ప్రభుత్వం, అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే నగరంలో అభివృద్ది పేరుతో ఆలయాలు, ప్రార్థనా మందిరాల తొలగింపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.