పల్లె పోరు షురూ
– ఖాళీగా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు కార్యాచరణ
– 11న తుది ఓటరు జాబితా ప్రచురణ
కర్నూలు(అర్బన్): జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2013వ సంవత్సరంలో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు పలువురు మృతి చెందడం, రాజీనామాలు చేయడం, ఇతరత్రా కారణాల వల్ల ఆయా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణను ప్రకటించింది. ఆ మేరకు ఈ నెల 11న ఆయా గ్రామ పంచాయతీల్లో తుది ఓటరు జాబితాలను ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గత నెల 20న 8 ఎంపీటీసీ, 17 సర్పంచ్, 28 వార్డు మెంబర్ల స్థానాలకు సంబంధించి ఓటరు జాబితాలను ప్రచురించారు. తాజాగా మరో మూడు సర్పంచ్, రెండు ఎంపీటీసీ, 28 వార్డులకు సంబంధించి ఓటరు జాబితాలను ప్రచురించేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాలను ఆయా గ్రామ పంచాయతీలకు పంపారు.