ఆల్ ఇన్ వన్
► అన్నీ ఆయనే..
► సగం ఫైళ్లు అతడి ఇంట్లోనే.. ఆరోపణలున్నా... అందలం
► అక్రమాలకు కేరాఫ్డీపీవో కార్యాలయంలో ఒకే ఒక్కడు
కరీంనగర్ సిటీ : నగరంలోని మంకమ్మతోటలో తెల్లవారడం లేటు... ఓ ఇంటి ముందు పదుల సంఖ్యలో కార్యదర్శులు, ఈవోలు, కారోబార్‌లు పడిగాపులు కాస్తుంటారు... ఆ ఇల్లేమైనా ఎమ్మెల్యేదా... ఇంతమంది వస్తుంటారేంటి? అని ఆ ప్రాంతంలో కొత్తగా వచ్చిన ఓ ఇంటి యజమాని ఆరా తీశారు. డీపీవో కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ ఇల్లు అది... ఆయనను దర్శించుకుంటేనే జిల్లాలో ఏ పనైనా జరిగేది. అందుకే ఇంటి ముందు జాతర అని పొరుగింటాయన చెబితే నోరెళ్లబెట్టాడు.
⇒ తిమ్మాపూర్ మండలం రామకృష్ణాకాలనీలో ఒక కళాశాల భవన నిర్మాణ అనుమతి కోసం సదరు యజమాని దరఖాస్తు చేసుకొన్నాడు. నిబంధనల ప్రకారం అయితే భవన నిర్మాణానికి అనుమతి దొరకదు. కొంతమంది సలహా మేరకు డీపీవో కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగిని కలవడం ఆలస్యం... ఆ భవన నిర్మాణానికి ఎన్‌వోసీ క్షణాల్లో వచ్చింది. దీని కోసం రూ.5 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి.
⇒ జిల్లాలో ఓ గ్రామసర్పంచ్ మరణించారు. సాధారణంగా అయితే సర్పంచ్ చనిపోయిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి 15 రోజుల్లోగా నివేదిక అందించాలి. సమాచారం ఆధారంగా ఆరు నెలల్లో ఉప ఎన్నికల పెట్టాల్సి ఉంటుంది. కాని ఇన్‌చార్జి సర్పంచ్‌గా ఉన్న ఉప సర్పంచ్‌కు ఒక చిక్కొచ్చి పడింది. ఎన్నికలు పెడితే తన సర్పంచ్ ఇన్‌చార్జి పోతుంది కాబట్టి, ఎన్నికలను వాయిదా వేయాలనుకున్నాడు. ఇంకేం... సదరు డీపీవో కార్యాలయ ఉద్యోగిని సంప్రదించి ‘ఫీజు’ ముట్టచెప్పాడు. ఇప్పటివరకు సర్పంచ్ చనిపోయిన సమాచారం ఎన్నికల సంఘానికి అందలేదు.’
⇒ జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి లీలల్లో మచ్చుకు కొన్ని ఇవి. సుదీర్ఘ కాలంగా కార్యాలయంలో తిష్ట వేసిన ఈయన, ‘అన్నీ తెలుసు’ అనే పేరుతో అక్రమాల పరంపరను సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాడు. అవడానికి జూనియర్ అసిస్టెంట్ అయినా డీపీవో కార్యాలయంలో ఆయనే బాస్. కార్యాలయం మొత్తం ఆయన చెప్పుచేతల్లో ఉందంటే అతిశయోక్తి కాదు. ఇది కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, సందర్శకులు ఎవరిని అడిగినా చెప్పే వాస్తవ విషయం. అవినీతి ఆరోపణలపై గత డీపీవోను జిల్లా కలెక్టర్ సరెండర్ చేసి, జిల్లా నుంచి పంపించడం తెలిసిందే. ఏ ఆరోపణల మీదనైతే డీపీవో సరెండర్ అయ్యారో, వాటికి కారణం సదరు ఉద్యోగి అనేది జగమెరిగిన సత్యం. కానీ, ఎక్కడా కాగితాలపై సంతకాలు ఉండవు కనుక, ఆయనకు పలుకుబడి అధికం కాబట్టి శిక్ష నుంచి తప్పించుకున్నాడు. విపరీతమైన ఆరోపణలు రావడంతో గతంలో ఆయనను ఓ డీఎల్‌పీవో కార్యాలయానికి పంపించారు. పంపించిన 15 రోజుల్లో తిరిగివస్తానని సహచరుల వద్ద చాలెంజ్ చేసిన సదరు ఉద్యోగి అన్నట్లుగానే 10 రోజుల్లోనే మళ్లీ డీపీవో కార్యాలయానికి వచ్చాడు.
దీనికోసం ‘ఉన్నత’ స్థాయిలో ఆయన పైరవీలు చేసుకోగా, ‘పని వచ్చినోడు అతనే’ అనే సాకుతో ఉన్నతాధికారులు సైతం ఆయనకే వంత పాడారు. ‘ఆల్ ఇన్ వన్’గా ఉన్నతాధికారులు ముద్దుగా పిలుచుకునే ఉద్యోగి అక్రమాల జాతర మళ్లీ కొనసాగుతోంది. సదరు ఉద్యోగిపై వందల సంఖ్యలో ఆరోపణలున్నా, ఆయన ‘పరపతి’ని మాత్రం ఉన్నతాధికారులు ఇసుమంతైనా ‘తగ్గించడానికి’ ఇష్టపడరు. డీపీవో కార్యాలయంలో ఏ సెక్షన్‌కు సంబంధించిన ఫైల్ అయినా సరే ఈయన చూడంది ఒక్క ఇంచు కూడా కదలదు. ఆయనను ‘కలిస్తే’ తప్ప ఆ ఫైల్‌కు పరిష్కారం దొరకదు.
ఆ మాట కొస్తే సగం ఫైళ్లు ఆయన ఇంట్లోనే ఉంటాయి. అవసరమైతే అవి ‘బార్’లకు కూడా వెళుతాయి. ఫైళ్లు రాయడం అతనికే తెలుసు కాబట్టి తప్పడం లేదంటూ ఉన్నతాధికారులు చెబుతున్నా, ఒకవేళ అదే నిజమైతే ఇతర ఉద్యోగులను కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికైనా సదరు ఉద్యోగి అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించి చర్యకు పూనుకొంటే... డీపీవో కార్యాలయంలో పారదర్శకత మచ్చుకైనా క నిపించే అవకాశం ఉంది.