పారిశుద్ధ్య లోపం వల్లే విషజ్వరాలు
-
కోదాడ కాలనీని సందర్శించిన డీఎంహెచ్‌ఓ
తొండంగి :
కోదాడ పంచాయతీలోని కోదాడ కాలనీలో పారిశుద్ధ్య లోపం వల్లే విషజ్వరాలు ప్రబలినట్టు డీఎంహెచ్‌ఓ చంద్రయ్య పేర్కొన్నారు. విషజ్వరాలపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన ఆయన ఆదివారం కోదాడ కాలనీలో పర్యటించి, రోగులతో మాట్లాడారు. అనంతరం వైద్య, ఆరోగ్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. పరిశుభ్రతపై ప్రజలు దృష్టి సారించాలని అవగాహన కల్పించారు. రామాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పలువురు గర్భిణులకు, బాలింతలకు వైద్యపరీక్షలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, దీనివల్ల విషజ్వరాలు, ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం మెరుగుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, వైద్యశిబిరం కొనసాగించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.
వైద్యాధికారులు, సిబ్బందిని నియమిస్తాం
జిల్లావ్యాప్తంగా 119 పీహెచ్‌సీలు ఉండగా, కొత్తగా మరో 9 మంజూరయ్యాయని డీఎంహెచ్‌ఓ తెలిపారు. వీటిలో వైద్యులు, ఇతర సిబ్బందిని త్వరలో నియమించనున్నట్టు వెల్లడించారు. తూరంగి, రాజపూడి, తేటగుంట, చేబ్రోలు, నాగాయలంక, పేరూరు, అడివి, వెల్ల, ఎస్.యానాంల్లో పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్రీ్టయ బాల ఆరోగ్య స్వాస్థ కార్యక్రమంలో భాగంగా 52 ప్రత్యేక బృందాలను నియమిస్తున్నట్టు వివరించారు.