ఫలించిన నిరీక్షణ
విశాఖ ఇంజినీర్‌ను విడిచిపెట్టిన కిడ్నాపర్లు 18 రోజుల తర్వాత విముక్తి
స్వీట్లు పంచుకున్న కుటుంబ సభ్యులు
భర్త శ్రీనివాస్‌తో స్కైప్‌లో మాట్లాడిన లలిత
పెదవాల్తేరు : కన్నీటి స్థానంలో ఆనంద బాష్పాలు.. దీన వదనాల్లో సంతోష రేఖలు.. నైజీరియాలో కిడ్నాప్‌నకు గురైన ఇంజనీరు సాయిశ్రీనివాస్ ఇంట్లో సందడి వాతావరణం.. విడుదలైనట్టు క్షేమ వార్త తెలియడంతో 18 రోజుల తర్వాత శనివారం ఉత్కంఠ వీడింది. దీంతో కుటుంబమంతా ఆనందడోలికలలో మునిగితేలారు. నైజీరియాలోగల భారత రాయబారి బి.ఎన్.రెడ్డి ఈ సమాచారాన్ని తనే స్వయంగా ఫోన్ ద్వారా సాయిశ్రీనివాస్ భార్య లలితకు తెలిపారు.
భారత హైకమిషన్, అక్కడి ఫెడరల్ గవర్నమెంట్‌తో పాటు, బెన్యూ రాష్ర్ట ప్రభుత్వం, డెంకోట్ ఇండస్ట్రీస్ చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. ప్రస్తుతం సాయిశ్రీనివాస్‌తోపాటు మరో భారతీయుడు అనిష్‌లు వారు పనిచేస్తున్న కంపెనీలో సురక్షింతంగా ఉన్నారు. వారికి అక్కడి ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.
ఫలించిన మంతనాలు
డెంకోట ఇండస్ట్రీస్ యాజమాన్యం కిడ్నాపర్లతో జరిపిన చర్చలు ఫలించడంతో కిడ్నాపర్ల చెరలో ఉన్న ఇద్దరి భారతీయులను సురక్షింతంగా విడిచిపెట్టారు. దీంతోపాటు అక్కడి ఫెడరల్ గవర్నమెంట్, బెన్యూ రాష్ట్ర ప్రభుత్వాలపై నైజరియాలో గల భారత హైకమిషన్ ఒత్తిడి తీసుకురావడంతో కిడ్నాప్ ఉదంతానికి చెక్ పడింది.
శనివారం ఉదయం 10.30గంటల సమయంలో నైజీరియాలో గల భారత రాయబారి బి.ఎన్.రెడ్డి ఫోన్ ద్వారా సమాచారం అందించారని సాయిశ్రీనివాస్ భార్య లలిత ఆనందభాష్పాల నడుమ తెలిపింది. ఈ 18 రోజులు క్షణమొక యుగంలా గడిచిందని, నరకయాతన అనుభవించామని ఉద్వేగంతో పేర్కొన్నారు. తెల్లవారితే ఏ కబురు వినాల్సి వస్తుందోనని నిద్రాహారాలు మాని గడిపామని బోరున విలపించారు.
అందరికీ ధన్యవాదాలు
నైజిరియాలో తన భర్త కిడ్నాప్‌నకు గురైన క్షణం నుంచి అతను సురక్షితంగా విడుదల కావాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని సాయిశ్రీనివాస్ భార్య లలిత ఉద్విగ్నంగా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ, మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి,ఎంపీ హరిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్‌లు తన భర్త సమస్యను భారత ైహైకమిషన్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఢిల్లీలోని ఆంధ్రభవన్ , నైజీరియాలో గల భారత రాయబారి బి.ఎన్.రెడ్డి కృషి మరవలేనన్నారు. వీరు ఎప్పటికప్పడు తనకు సమాచారం అందించి మనోస్థైర్యాన్ని నింపారన్నారు.
క్షణమొక యుగంలా...
రోజూ రక్షణ సిబ్బంది తోడుగా కార్యాలయానికి వెళ్లేవాడిని. ఆ రోజు సెక్యూరిటీ లేకుండానే విధులకు బయలుదేరాను. కొద్ది సేపటిలో కంపెనీకి చేరుకుంటామనగా అగంతకులు దాడి చేశారు. రెప్పపాటులో నన్ను, మరో ఇంజినీరు అనిష్‌ను వారి వాహనంలోకి తరలించి నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకుపోయారు. అక్కడ మా ఇద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం కల్పించలేదు. కేవలం రొట్టె మాత్రమే ఆహారంగా ఇచ్చేవారు.
18 రోజులూ అది తినే బతికాం. ఎప్పుడు ఏం చేస్తారో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపాం. క్షణమొక యుగంలా గడిచింది. మళ్లీ కుటుంబ సభ్యులను కలుస్తామని అనుకోలేదు. ఆ భగవంతుడి దయ, భారత ప్రభుత్వం కృషి వల్ల సజీవంగా కిడ్నాపర్ల చెర నుంచి వీడాం. కిడ్నాపర్ల డిమాండ్లను నైజీరియా ప్రభుత్వంతోపాటు మా కంపెనీ త్వరగా తీర్చి ఉంటే ఇంకా ముందుగానే విడుదలయ్యేవాళ్లం. మీడియాలో వరుసగా వచ్చిన కథనాల వల్ల ఆలస్యమయింది.
నా విడుదలకు ప్రయత్నించిన అందరికీ కృతజ్ఞతలు అంటూ ఉద్వేగంగా సాయి శ్రీనివాస్ ‘సాక్షి’తో మాట్లాడారు. అంతకుముందు స్కైప్‌లో భార్యతో మాట్లాడిన సాయిశ్రీనివాస్ మాసిన గెడ్డంతో నీరసంగా కనిపించారు. ఆరోగ్యం క్షీణించి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.