నేటి నుంచి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
-
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
గూడూరు:
అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రాష్ట్రస్థాయి సీనియర్ పురుషులు, స్త్రీల వాలీబాల్ టోర్నమెంట్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకుగాను 15 రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలో ఐదు కోర్టులు ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయి పోటీల తరహాలో ఏర్పాట్లు, ప్రేక్షకులకు సీటింగ్ అరేంజ్‌మెంట్స్, రాత్రి వేళ పోటీలను నిర్వహించేందుకు అనువుగా ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. కోర్డు ప్రాంగణాలకు అన్ని వైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హాజరయ్యే క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు, భోజన వసతిని హరిచంద్రారెడ్డి ట్రస్ట్ తీసుకుంటోంది.
క్రీడాకారుల్లో ఆసక్తి పెంపు -రవీంద్రబాబు, శాప్ డైరెక్టర్
గూడూరు లాంటి ప్రాంతాల్లో ఇలాంటి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించడం ద్వారా ఈ ప్రాంత క్రీడాకారుల్లో ఆసిక్తిని పెంపొందిచినట్లవుతుంది. జాతీయ స్థాయి పోటీలను తలపించేలా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది.
ఎంతో ఆనందంగా ఉంది -కనుమూరు హరిచంద్రారెడ్డి , ట్రస్ట్ వ్యవస్థాపకుడు
రాష్ట్ర స్థాయి పోటీలను గూడూరులో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఓజిలిలో జరిగిన సమ్మర్ క్యాంప్‌ను చూసినప్పటి నుంచీ ఇలాంటి టోర్నమెంట్‌ను గూడూరులో నిర్వహించాలనుకున్నా. ఇప్పటికి కార్యరూపం దాల్చింది. అనంతపురంలో జరగాల్సిన ఈ టోర్నమెంట్‌ను గూడూరులో జరిగేలా చేసిన అందరికీ కృతజ్ఞతలు.
ఆదరణ పెరగాలి -కమలాకర్‌రెడ్డి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ
వాలీబాల్ క్రీడకు ఇంకా ఆదరణ పెరగాలి. రాష్ట్రస్థాయి పోటీలను తిలకించడం ద్వారా క్రీడపై ఆసక్తి ఇంకా పెరుగుతుంది. ఇంత బడ్జెట్‌తో ఒకే స్పాన్సర్‌తో నిర్వహించడం ఇదే ప్రథమం.